దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి

పింఛన్ లబ్ధిదారులకు దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ చేత విచారణ జరిపించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. అవృద్ధాప్య పింఛనుదారులు పంపిణీ చేసిన దొంగ నోట్ల వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయలని ఆయన హితవు చెప్పారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో గ్రామ వలంటీరు పింఛను డబ్బుల్లో దొంగనోట్లు కలిపి పంపిణీ చేయడంపై ఆయన  తీవ్రంగా స్పందించారు.
 
“మా పార్టీ నేతలను ప్రజలంతా దొంగలుగా భావిస్తున్నారు. తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షించాలి. మా పార్టీ పెద్దలకు అప్రతిష్ట లేకుండా చూడాలి. దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఇటీవల డీజీపీగా పదోన్నతి పొందిన సునీల్ కుమార్ విచారణ చేసి ప్రభుత్వం తప్పు లేదంటే… కావాలనే చెప్పించారని అంటారు. అందుకే ఎన్ఐఏ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలి” అంటూ ఎద్దేవా చేశారు.
 
 దొంగనోట్ల పంపిణీతో పింఛన్ ప్రపంచం నిర్గాంత పోయిందని పేర్కొంటూ  తమకిచ్చిన డబ్బులలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయా? అని వృద్ధులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మరొకసారి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
 
 దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని తనవంతుగా లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వాలంటీర్లు దొంగ నోట్లు ఇస్తున్నారా?, లేకపోతే వారితో ఎవరైనా ఇప్పిస్తున్నారా?? అని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత ఆ డబ్బులలో దొంగ నోట్లు ఎవరైనా పెడుతున్నారా?, లేకపోతే పెట్టిస్తున్నారా?? అన్నది తేలాలని స్పష్టం చేసారు.
 
వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం., వాలంటీర్ తానే ఆ తప్పు చేశానని అంగీకరించడంతో కేసును మూసి వేసే ప్రయత్నం జరుగుతుందని ధ్వజమెత్తారు.
 
అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా??, అని ప్రశ్నిస్తూ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్టు తేలిందని గుర్తు చేశారు.
 
పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ దురుద్దేశం ఉందని రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. ప్రతి నెల రూ. 1800 కోట్ల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపి పంపిణీ చేసిన రూ. 80 కోట్ల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్తాయని అనుమానం వ్యక్తం చేశారు.