తానే ప్రధాని అయిపోతానని కేసీఆర్ పగటి కలలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గాడి తప్పుతున్నారని, తాను దేశానికి ప్రధానమంత్రిని అయిపోతానంటూ పగటికలలలు కంటున్నారని బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చిన పది రోజులకు జాతీయ కార్యవర్గ నిర్ణయాలు ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు.
 
ఆ కొత్త పార్టీ ఇంకా బాలారిష్టాలు దాటక ముందే, కేసీఆర్ పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం మొదలుపెట్టేశారని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో కేసీఆర్ గొప్ప పాలనేమీ అందించలేదనిపేర్కొంటూ అసలు తెలంగాణలో పాలనాపరంగా ఒక పద్ధతి, ఒక నిర్మాణాత్మక వ్యవస్థ, ఒక నూతన విధానం స్థాపించలేని ఆయన, తెలంగాణ మోడల్ అని దేన్ని చూపిస్తారు? ఎక్కణ్ణుంచి చూపిస్తారు? అని ప్రశ్నించారు.
 
తెలంగాణ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉందని, కేవలం మందు, పెట్రోల్ ఆదాయాల మీద ఆధారపడి బండి లాగిస్తున్నారని కృష్ణ సాగర్ రావు గుర్తు చేశారు. పెట్టుబడుల ఉపసంహరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్యలు, ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని స్పష్టం చేశారు.
 
 ప్రభుత్వానికి వ్యాపారం చేసే పని లేదనే పరిణితి చెందిన ఆర్థిక సూత్రాన్ని ఆయన అర్థం చేసుకోలేరని విమర్శించారు.  తమ పార్టీ గెలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన కంపెనీలను తిరిగి వెనక్కు తీసుకుంటాం అని చెప్పడం పెద్ద జోక్ అని మండిపడ్డారు.  కేసీఆర్ గారు ముందు పగటి కలలు కనడం మానేసి, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే పనిచేస్తే మంచిందని  ఆయన హితవు చెప్పారు.