త్రిపుర మంత్రి, గిరిజన నేత నరేంద్ర దెబ్బర్మ కన్నుమూత

సీనియర్‌ రాజకీయ నాయకుడు, బీజేపీ మిత్రపక్షమైన ఇండిజెనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్ టి) అధ్యక్షుడు, త్రిపుర రాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి నరేంద్ర చంద్ర దెబ్బర్మ (80) ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గత శుక్రవారం తీవ్రమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబసభ్యులు.. అగర్తలాలోని గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.
 
మూడు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న దెబ్బర్మ ఇవాళ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గిరిజన నాయకుడైన దెబ్బర్మ ఐపిఎఫ్ టి ని  స్థాపించి విజయవంతంగా నడిపించారు. 2018లో బిజెపితో కలసి సంకీర్ణ సర్కారు ఏర్పాటులో కూడా దెబ్బర్మ కీలకపాత్ర పోషించారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ కూటమిని ఓడించారు. కాగా, దెబ్మర్మకు నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు, భార్య ఉన్నారు.
రాజకీయాలలోకి రాకముందు చాలాకాలం పాటు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన మృతి పట్ల త్రిపుర ముఖ్యమంత్రి డా. మాణిక్ సహా, ఇతర నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రమే ఆసుపత్రికి సందర్శించి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వైద్యులతో సంప్రదింపులు జరిపారు.