భారత్, పాక్ అణు స్థావరాలు, ఖైదీల జాబితాల మార్పిడి

భారత్‌, పాకిస్థాన్‌ అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని యథావిధిగా పాటించాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో భారత్‌, పాక్‌కు సంబంధించిన అణు కేంద్రాలు, ఖైదీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి.

2008లో కుదిరిన ఒప్పందం నిబంధనల ప్రకారం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని దౌత్య కార్యాలయాల్లో అధికారులు ఈ జాజితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఈ జాబితాను మార్చుకుంటారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పుడు దాడుల సందర్భంగా అణు స్థావరాలపై దాడులు చేయకూడదన్న ఉద్దేశంతో 1992 నుంచి వాటి వివరాలను మార్పిడి చేసుకుంటున్నాయి. అలాగే ఇరు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. 

జాబితాలోని వివరాల ప్రకారం, 339 సాధారణ పౌరులు, 95 మంది పాకిస్థానీ మత్స్యకారులు ప్రస్తుతం భారతదేశ కస్టడీలో ఉన్నారు. పాకిస్తాన్‌ జాబితాలో 51 మంది భారత పౌరులు, 654 మంది మత్స్యకారులు వారి కస్టడీలో ఉన్నారు. 

సివిలియన్ ఖైదీలు, జాడతెలియకుండా పోయిన భారత రక్షణ శాఖ సిబ్బంది, మత్సకారులను వారి పడవలతో సహా సాధ్యమైనంత త్వరగా పాకిస్థాన్ కస్టడీ నుంచి తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఆ ప్రకటనలో కోరింది. జైలుశిక్ష పూర్తి చేసుకుని, జాతీయత గుర్తించిన 631 మంది మత్స్యకారులు, ఇద్దరు సివిలియన్ ఖైదీలను త్వరితగతిన విడిచి వెట్టాలని పాకిస్థాన్‌ను కోరినట్టు ఎంఈఏ తెలిపింది. 

భారతీయులుగా అనుమానిస్తున్న పాక్ కస్టడీలోని తక్కిన 32 మంది మత్స్యకారులు 22 సివిలియన్ ఖైదీలను కూడా విడిచిపెట్టాలని ఎంఈఏ కోరింది. భారత సివిలియన్ ఖైదీలు, మత్స్యకారులుగా భావిస్తున్న వారందరికి తగిన భద్రత కల్పించి భారత్‌కు తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది.

స్వాధీనం చేసుకున్న మత్స్యకారుల పడవలను కూడా అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్‌ ఈ సందర్భంగా కోరింది. అలాగే తమ దేశ  జైళ్లలో ఉన్న పాకిస్థాన్‌ మత్స్యకారుల విడుదలకు సుముఖత వ్యక్తం చేసింది.

అదే విధంగా, అనుస్థావరాలు, అణుసదుపాయాలకు సంబంధించిన జాబితాను కూడా ఇరుదేశాలు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం అందజేసుకున్నాయి. 1991 జనవరి 27న ఇందుకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏటా జనవరి 1వ తేదీన ఈ సమాచారాన్ని ఉభయ దేశాలు ఎక్స్ఛేంజ్ చేసుకుంటాయి. అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను ఇరు దేశాలు మార్పిడి చేసుకోవడం 1992 జనవరి 1 నుంచి ఇది 32వ సారి.