తెలంగాణ డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అంజ‌నీ కుమార్

తెలంగాణ నూత‌న డీజీపీగా అంజ‌నీ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌తో పాటు ప‌లువురు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

అంతకు ముందు, ఉద‌యం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడ‌మీలో మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి చెప్పారు

1966 జనవరి 28న బీహార్ లో అంజనీకుమార్ జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను పాట్నాలో పూర్తి చేసిన ఆయన  పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఢిల్లీ యూనివర్శిటీలో పూర్తి చేశారు. ఐపీఎస్ గా ఎన్నికైన తర్వాత 1992లో జనగామ ఏఎస్పీగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీపీ స్థాయికి చేరుకున్నారు.

ఐపీఎస్‌ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్ర‌పతి పోలీసు మెడల్‌ అందుకొన్నారు.  మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. 2003 వరకు సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, అనంతరం రాష్ర్ట సర్వీసులకు వచ్చారు.

2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీగా, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీగా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్‌ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర‌ డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్‌ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్‌ ముందువరుసలో ఉన్నారు.  2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను డీజీపీ అంజ‌నీ కుమార్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు డీజీపీగా అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.