పాక్‌లో హిందు మహిళ దారుణ హత్యపై భారత్ ఆగ్రహం

పాకిస్తాన్‌లో ఓ హిందు మహిళను అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సింజోరోలో హిందు మహిళ తల నరికి, చర్మ ఒలిచి హత్య చేసినట్లు పాకిస్తాన్‌ తొలి హిందూ మహిళా సెనేటర్‌ కృష్ణకుమారి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు.

ఈ దుర్ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను నెరవేర్చాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. వారికి భద్రత, రక్షణ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ దేశంలోని సింఝోరోలో ఓ హిందూ మహిళ (40) తలను తెగనరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె చర్మాన్ని ఒలిచేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పాకిస్థాన్‌ తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణ కుమారి ఇచ్చిన ట్వీట్‌లో, సింఝోరో పట్టణంలో బుధవారం దాదాపు 40 సంవత్సరాల వయసుగల హిందూ మహిళ దయా భెల్ తలను తెగ నరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె ముఖం, శరీర భాగాల్లోని చర్మాన్ని ఒలిచారని వెల్లడించారు. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి తాను వెళ్ళానని, సింఝోరో, షాపుర్చకర్ పోలీసులు కూడా చేరుకున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో గురువారం విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఈ సంఘటన గురించి సవివరమైన నివేదిక తన వద్ద లేదని చెప్పారు. మైనారిటీలపట్ల పాకిస్థాన్‌ శ్రద్ధ వహించాలని గతంలో కూడా చెప్పామని పేర్కొన్నారు. మైనారిటీల రక్షణ, భద్రత, సంక్షేమాల కోసం చర్యలు తీసుకోవలసిన బాధ్యత పాకిస్థాన్‌కు ఉందని, ఆ బాధ్యతను ఆ దేశం నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు.