నకిలీ సర్టిఫికెట్లతో విదేశీ వైద్య పట్టభద్రులపై సీబీఐ దాడులు 

నకిలీ అర్హతా సర్టిఫికెట్లను ఉపయోగించినందుకు 73 విదేశీ వైద్య పట్టభద్రులు, 14 రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్ళ అధికారులు, పూర్వపు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) అధికారులపై, 90కి పైగా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు, తనిఖీలు నిర్వహించింది. 

నకిలీ సర్టిఫికెట్లతో లబ్దిపొందిన వారిలో చైనాలోని వైద్య సంస్థల నుండి 21మంది, రష్యా నుండి 14మంది, నేపాల్‌ నుండి ఆరుగురు, పూర్వపు సోవియట్‌ నుండి ఆరుగురు, కిర్గిస్తాన్‌ నుండి నలుగురు, కజకస్తాన్‌, ఆర్మేనియాల నుండి ముగ్గురు, రొమేనియా నుండి ఇద్దరు, నైజీరియా నుండి ఒకరు తమ డిగ్రీలు తీసుకున్నారు. 

ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, సిక్కిం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడుల్లో నిందితులు, అనుమానితులకు చెందిన ప్రాంతాల్లో ఈ సోదాలు సాగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. 

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బిఇఎంఎస్‌) నిర్వహించిన ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజిఇ)లో అర్హత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు ఆధారంగా మెడికల్‌ కౌన్సిళ్ళలోనిమెడికల్‌ గ్రాడ్యుయేట్ల నమోదులో అవకతవకలు జరిగాయనిఆరోపిస్తూ కేసు నమోదైంది. 

అభ్యర్ధులు అర్హత సాధించకపోయినప్పటికీ వివిధ రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్ళలో, ఎంసిఐలో నమోదయ్యారని, ఇలాంటి కేసులు చాలానే వున్నట్లు ప్రభుత్వం కనుగొనడంతో సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది.

తెలుగు దేశాల్లో ఆరుగురు నకిలీ వైద్యులు 

 దీనిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఆరుగురు నకిలీ వైద్యులు గల్ఫ్‌ దేశాల్లో, కేరళ, ఇతర ప్రాంతాల్లో వైద్యులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు గుర్తించారు. వీరిపై సీబీఐ క్రిమినల్‌ కేసులను నమోదు చేసింది.

వాళ్ళు కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేశ్‌ కుమార్‌, చేవెళ్లకు చెందిన శ్రీనివాసరావు, వరంగల్‌ కు చెందిన మహమ్మద్‌ ఫసీయుద్దీన్‌, లింగంపల్లికి చెందిన బి హరికృష్ణారెడ్డి, విజయవాడకు చెందిన మారుపిళ్ల శరత్‌ బాబు, విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట రాజ వంశీపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 

వీరంతా ఫారీన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష ఉత్తీర్ణులు కాకుండానే సేవలు అందిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.