కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరోనాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా  మాస్కులు ధరించాలని ఆదేశించింది. 
 
అటు నూతన సంవత్సర వేడుకలను అర్థరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది. కరోనాపై సమీక్ష నిర్వహించిన  కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలబురగి విమానాశ్రయంలో ప్రయాణికులకు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఎయిర్ పోర్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మాస్క్ లేని వారిని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోకి అనుమతించబోమని కలబురగి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చిలక మహేష్ తెలిపారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నందున అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రెవెన్యూ శాఖ  మంత్రి ఆర్ అశోక తెలిపారు.
ఆరోగ్య మంత్రి కె. సుధాకర్‌తో కలిసి కరోనాపై సమావేశం నిర్వహించామని..ప్రయాణికులు కరోనా లక్షణాలు కలిగి ఉన్నట్లయితే..వారికి చికిత్స అందించడానికి బెంగళూరులో రెండు ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు.  మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా నిఘా బృందాలను ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు. గర్భిణులు, చిన్నారులు, పెద్దలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనాన్ని అనుమతించవద్దని పేర్కొన్నారు. స్కూళ్లలో శానిటైజర్లను ఉపయోగించడం, మాస్కులు ధరించేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రజలంతా టీకాలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కరోనాపై మార్గదర్శకాలు విడుదల చేసినంత మాత్రాన భయపడాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నిబంధనలను తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు.