బలవంత మత మార్పిడిపై జనవరి 2న `సుప్రీం’ విచారణ

బలవంత మత మార్పిడిని నియంత్రించేలా ప్రభుత్వాలకు ఆదేశించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్‌పై జనవరి 2 న విచారించడానికి సుప్రీంకోర్టు నిర్ణయించింది. బెదిరింపులతోను, బహుమతులు, ఆర్థిక ప్రయోజనాల ఎర చూపి మోసపూరితంగా ఆకర్షించడం ద్వారా జరుగుతున్న బలవంతపు మతమార్పిడులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ తాజాగా సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలైంది.

అడ్వకేట్ ఆశుతోష్ కుమార్ శుక్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మతమార్పిడిపై ఎప్పటికప్పుడు చెక్ ఉండేలా స్పెషల్ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాలని కూడా ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌లు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించే బాధ్యత రాష్ట్రాలు వహించాలని పిటిషనర్ సూచించారు.

ఒకరి మతాన్ని ప్రచారం చేసే హక్కు ఉన్నప్పటికీ, మరొకరి మతాన్ని మార్చే హక్కు మాత్రం లేదని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలు చాలావరకు నిరక్షరాస్య ప్రాంతాలని, ఆరోగ్యం, విద్య, ఆహారం , తాగునీటి తదితర సౌకర్యాలు సరిగ్గా అందక వెనుకబడి ఉంటారని, అలాంటి ప్రాంతాలు సామాజికంగా చాలా వెనుకబడి ఉంటాయని పిటిషన్‌లో వివరించారు.

ఈ సామాజిక వెనుకబాటు మిషనరీలకు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి తమ సువార్త సందేశం ప్రచారం చేయడానికి అవకాశం కల్పిస్తోందని, చివరికి మతమార్పిడికి దారి తీస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, తెగల విషయంలో ఇది జరుగుతోందని, దీన్ని నివారించవలసిన బాధ్యత రాష్ట్రాలదేనని పిటిషనర్ సూచించారు.

ధాతృత్వ ప్రయోజనం మతమార్పిడికి దారి తీయకూడదని ఇదివరకు సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ఒత్తిడితో బలవంతంగా మతమార్పిడి చేయించడం తీవ్రమైన అంశమని, రాజ్యాంగానికి విరుద్ధమని , బలవంత మార్పిడి జాతీయ భద్రతకు ప్రమాదమని, పౌరుల మతస్వేచ్ఛకు ఆటంకమని కూడా సుప్రీం పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల సూచించింది. బెదిరింపులతో, మోసంతో జరుగుతున్న మతమార్పిడిని ఆపకపోతే చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.