అమెరికా, జపాన్ లలో మంచు తుఫాను బీభత్సం

* అమెరికాలో ఇద్దరు గుంటూరు వాసులు మృతి
 
అమెరికా, జపాన్ లలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 60 మందికి పైగా మృత్యువాత పడగా, జపాన్ లో 17 మంది పడ్డారు. జపాన్‌లో సుమారు 93 మంది కనిపించకుండా పోయారు.
 
మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. అమెరికాలో చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. 
 
విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. బఫెలో ఎయిర్‌పోర్టులో 43 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. న్యూయార్క్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ పేర్కొన్నారు. తుపాను కారణంగా ఒక్క న్యూయార్క్‌లోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
కాగా, అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందారు. న్యూజెర్సీలో ఐస్‌లేక్‌లో చిక్కుకుని నారాయణ, హరిత అనే దంపతులు మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పలపర్రు గ్రామ వాసులుగా గుర్తించారు. దంపతులిద్దరూ కలిసి ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు. ఆ సమయంలో లేక్ ఒడ్డునే వారి పిల్లలు ఉండటంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి సహాయక సిబ్బంది వెలికితీశారు. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు.  కొన్ని ప్రాంతాల్లో సుమారు 30 నుంచి 40 అంగుళాల మేర మంచు కప్పుకుపోయినట్లు తెలిపారు. అక్కడి పరిస్థితిని అధ్యక్షుడు జో బైడెన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్‌ వివరించారు. 
 
రోడ్లన్నీ కార్లు, బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులతో నిండిపోయాయి. వీధులన్నీ మంచులతో నిండిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు, వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒంటరిగా ఉండేవారికి వైద్య పరమైన సాయం అందించడం కష్టంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు హై లిఫ్ట్ ట్రాక్టర్లను మోహరించారు.
 
జపాన్ లో కూడా చలి తీవ్రంగా పెరిగిపోయి జనం గడగడ వణికిపోతున్నారు. తీవ్రమైన మంచు తుఫాన్‌ ధాటికి జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు. హీటర్‌లు వేసుకుని ఇండ్లలోనే ఉంటున్నారు. జపాన్‌కు ఉత్తరంగా ఉన్న హొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ మంచు పొరల స్థాయులు 1.20 
మీటర్ల స్థాయికి చేరాయి.