ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దు  

ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని ఆమె పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు లేవనెత్తిన పలు అంశాలపై ఆమె స్పందించారు.
పెరుగుతున్న యువ జనాభా భారత్‌కు మరింత సానుకూలమని చెబుతూ మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని ఆమె తెలిపారు. గ్రామం, ఏజెన్సీ నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయొద్దని ఆమె సూచించారు. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామ దేవత రక్షణగా ఉందన్న రాష్ట్రపతి మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని చెబుతూ  తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు విలువల గురించి నేర్పించాలని ఆమె కోరారు.  విద్య అనేది దేశ నిర్మాణానికి పునాది అని, ప్రతి వ్యక్తి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇది కీలకం అని ముర్ము చెప్పారు. ముఖ్యంగా మహిళలు చదువులో రాణించాలని కోరుతూ ఒక మహిళ విద్యనభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని విద్యావంతులను చేస్తారన్న మహాత్మాగాంధీ మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు.
 
బాలికలకు విద్య, అవకాశాలలో సమాన ప్రవేశం కల్పించినప్పుడు వారు అబ్బాయిల కంటే ఎక్కువ సాధించారని ముర్ము చెప్పారు. ఇక మన పూర్వీకులు వేసిన పునాదులపై మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేలా చూడాల్సిన బాధ్యత భారతదేశంలోని యువకులందరికీ ఉందని ఆమె స్పష్టం చేశారు. 
 
ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగం అని, శ్రద్ధ తగ్గిపోతున్నప్పుడు కమ్యూనికేషన్ పరిమితం అవుతుందని ఆమె చెప్పారు. అవగాహనను మెరుగుపరచడానికి ,దృక్పథాన్ని విస్తరించడానికి ఎక్కువగా చదవాలని ఆమె విద్యార్థులను కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని అంటూ భారత్‌లో ఉన్న జనాభా అమెరికాలో లేదని గుర్తు చేశారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలోని లేవని స్పష్టం చేశారు.
 
 హైదరాబాద్‌ కు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని రాష్ట్రపతి కొనియాడారు. ‘గొప్ప సాంస్కృతిక వారసత్వం, విభిన్న జనాభా కలిగిన నగరం హైదరాబాద్ . ఇది విభిన్న ఆలోచనలు, దృక్కోణాల సమ్మేళనంగా మారిపోయింది. ఈ వైవిధ్యమే హైదరాబాద్ ప్రధాన బలం. అభివృద్ధికి కేంద్రంగా నగరం విజయానికి దోహదపడింది’ అని ఆమె తెలిపారు. 
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యకలాపాలు 1940 లో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమై నేడు తొమ్మిది వేర్వేరు కళాశాలలు, 11,000 మందికి పైగా విద్యార్థులతో ప్రధాన విద్యా కేంద్రం స్థాయికి అనేక రెట్లు పెరగడం సంతోషదాయకమని రాష్ట్రపతి పేర్కొన్నారు. జస్టిస్ కేశవరావు కొరాట్కర్ ఆదర్శాలకు ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటయిన కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సాధించిన అభివృద్ధి అసలైన నివాళి అని ఆమె తెలిపారు.

హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమరం భీమ్, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయబుల్లా ఖాన్ లకు ఆమె నివాళులర్పించారు. వారి శౌర్యం, త్యాగం చిరస్మరణీయమని, ఎప్పటికీ గౌరవప్రదమని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కేశవ్‌ మెమోరియల్‌లో ప్రాంతీయ స్వాతంత్ర్య సమరయోధుల కృషిని తెలియచేస్తూ, ‘హైదరాబాద్ విమోచన ఉద్యమం’ పైఅంశంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.