తెలంగాణలో బీజేపీ రైతు ఆందోళనలు 

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు ధర్నా, రైతు దీక్ష పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ లో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు ‘రైతు ధర్నా’ పేరుతో చేపట్టిన నిరసన  కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు నరహరి వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  హనుమకొండ కాళోజీ సర్కిల్ వద్ద జరిగిన ‘రైతు ధర్నా’ లో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జ్ మురళీధర్ గౌడ్,  రైతులు పాల్గొన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జరిగిన  ‘రైతు ధర్నా’ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ..జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సిద్దిపేట కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రైతు రుణమాఫీ చేయాలని, ధరణి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.  మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ రైతు ధర్నాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ప్రశ్నించారు.  రాబోయే రోజుల్లోనూ రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు కరెంట్ ఎక్కడ ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో కలెక్టరేట్, నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఆ తర్వాత కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించింది.