మతం మారిన వారిని తిరిగి తీసుకు రావాలి

మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలని.. తిరిగి వచ్చిన వారిని కాపాడుకోవాలని, వెళ్లేవారిని ధర్మం వీడకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం జీ పిలుపిచ్చారు. పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాచిగూడ లోని జాగృతి భవన్ లో ధర్మ రక్ష దివాస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ధర్మ రక్షణ కోసం పాటుపడాలని సూచించారు.
వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకుంటున్నామని చెబుతూ ఇక దేశంలోని గ్రామ గ్రామాన రామకార్యాన్ని పెంచుకోవాలని చెప్పార.  వందల సంవత్సరాల పరాయి పాలన హిందూ ధర్మంపై విపరీతంగా దాడి చేసిందని, ధార్మికతను అంతం చేసేటందుకు ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
గడచిన 75 సంవత్సరాల పాటు భారతదేశంలో హిందూ ధర్మంపై దాడి జరిగిందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాలలోని 40 వేల గ్రామాలలో 80 వేల మంది పాస్టర్లు పనిచేస్తున్నారని చెప్పారు.హిందువులంతా తిరగబడితే ధర్మం రక్షించబడుతుందని స్పష్టం చేశారు.  పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ దుర్గానంద పూరి స్వామీజీ హాజరయ్యారు.
సీనియర్ జర్నలిస్ట్ రాక సుధాకర్  మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేయడం, కొండ కోనలు గిరిజన ప్రాంతాలలో అబద్ధాలు నూరి పోయడం.. అసత్యాలు బోధించడంతోనే చాలామంది ధర్మం వీడుతున్నారని తెలిపారు. వాస్తవాలు తెలిశాక వెళ్లిన వారంతా తిరిగి స్వధర్మం లోకి వస్తున్నారని ఆయన గణంకాలతో సహా చెప్పారు.
అవగాహన లేని వారిని ఎన్నుకొని, మెజారిటీ ప్రజలపై ద్వేషభావం నింపడం.. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడం క్రైస్తవ మిషనరీలు లక్షంగా పెట్టుకుని పనిచేస్తున్నాయని విమర్శించారు. “నేను వేరు.. ఈ ప్రజలు వేరు.. నేను వేరు ఈ దేశం వేరు” అనే భావనను అమాయక ప్రజల్లో నింపి భారతదేశంపై విద్వేషం సృష్టిస్తున్నారని చెప్పారు.
పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, సహకార్య దర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీ శేఖర్, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.