పోలీసులంటే నేరస్థులలో వణుకు, సామాన్యులతో రక్షకుడిగా ఉండాలి 

పోలీసులంటే  నేరస్థులు భయంతో వణికి పోవాలని, కానీ, అదే సమయంలో సామాన్య పౌరుడు పోలీసులను స్నేహితుడిగా, రక్షకుడిగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హితవు చెప్పారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండియన్ పోలీస్ సర్వీస్ 74వ బ్యాచ్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ పోలీసులు ప్రభుత్వానికి అత్యంత శక్తివంతమైన భాగం అని తెలిపారు. 

దేశ పురోగతిలో, సమాజ పరివర్తనలో పోలీసు బలగాలు భాగస్వాములు కావాలని రాష్ట్రపతి పిలుపిచ్చారు. సుస్థిర అభివృద్ధిని, ముఖ్యంగా సమ్మిళితం నిర్ధారించడం ద్వారా దేశ సౌభాగ్యం దిశగా పోలీసు అధికారులు మార్పు సారథ్య పాత్రను పోషించబోతున్నారని ఆమె చెప్పారు.  దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో, బలోపేతం చేయడంలో మన పోలీసు దళం అందించిన గొప్ప కృషిని దేశం గుర్తించిందనిఆమె తెలిపారు.

పోలీసు బలగాలు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడు, అది ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతుంది. తమ కింద ఉన్న మొత్తం దళం, చివరి కానిస్టేబుల్ వరకు అప్రమత్తత, సున్నితత్వం, నిజాయితీని ప్రదర్శించినప్పుడు మాత్రమే పోలీసులు గౌరవం, నమ్మకాన్ని పొందుతారని ఆమె వివరించారు. తమ కెరీర్ ప్రారంభం నుండి, ఐపిఎస్ ప్రొబేషనర్లు నాయకత్వ స్థానాల్లో ఉంటారని ఆమె చెప్పారు. 

వారి నాయకత్వ ప్రమాణాలు వారి నేతృత్వంలోని దళం సమర్థత, మనోధైర్యాన్ని నిర్ణయిస్తుందని చెబుతూ సమగ్రత, నిష్పాక్షికత, ధైర్యం, సామర్థ్యం, సున్నితత్వం అనే ఐదు ప్రాథమిక లక్షణాలను మనస్సులో ఉంచుకుని కార్యాచరణ ద్వారా ప్రదర్శించాలని ఆమె వారికి సలహా ఇచ్చారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న నిరక్షరాస్యుడైన పేదవాడికి స్థానిక పోలీసు స్టేషన్ లో సానుభూతి, మద్దతు లభించేలా పోలీసు అధికారులు చూసుకోవాలని ఆమె సూచించారు.

మన ప్రకటిత జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ‘ అమృత్ కాల్’ సందర్భంగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో నారీ శక్తి ప్రధాన పాత్రను పోషించాలని రాష్ట్రపతి చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే ఆత్మనిర్భర్ నారీ. మహిళల భాగస్వామ్యం మెరుగైన సమగ్ర అభివృద్ధికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. 

మహిళలకు సాధికారత కల్పించే దశ నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి స్థాయికి మనం వేగంగా ముందుకు సాగాలిని ముర్ము పిలుపిచ్చారు. మహిళా పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఇతర మహిళలకు, ముఖ్యంగా నిస్సహాయులకు సహాయం చేయాలని ఆమె కోరారు. ప్రతి మహిళ తమలోని బలహీనుల పక్షాన నిలబడితే, సమాజం గొప్ప పరివర్తనను చవిచూస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ ఐక్యతను పరిరక్షించడంలో భారతీయ పోలీసులు భారీ సేవలు అందించారని పేర్కొంటూ భారతదేశ అంతర్గత భద్రత కోసం వేలాది మంది ధైర్యవంతులైన పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారని ఆమె కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐపీఎస్ అధికారులకు ఆమె నివాళులు అర్పించారు.