ఒడిశా హోటల్‌లో రష్యా నేత అనుమానాస్పద మృతి

రష్యా చట్ట సభ ప్రతినిధి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు పావెల్ ఆంటోవ్ ఒడిశాలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో వెకేషన్ కోసం ఆయన వచ్చారు. తన 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడానికి ఆయన మరో ముగ్గురు మిత్రులతో కలసి పర్యాటక  వీసాపై భారత్‌లో పర్యటిస్తున్నారు.

హోటల్‌లోని మూడో అంతస్థు కిటికీనుంచి కిందపడి ఆయన మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. పావెల్ ఓ మల్టీ మిలియనీర్. గొప్ప దాతగా కూడా ఆయనకు పేరుంది. రాయగడ హోటల్‌లో శనివారం రక్తపు మడుగులో పావెల్‌ను పోలీసులు గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలో అదే హోటల్‌లో బస చేస్తున్న ఇద్దరు రష్యన్లు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉండడంతో ఈ మృతి పలు అనుమానాలకు దారితీస్తుంది.  స్థానిక మీడియా నివేదిక ప్రకారం పుతిన్‌ విమర్శకులు రష్యాలో ఇదేవిధంగా మరణించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో  రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని ఒకే హోటల్‌లో ఇద్దరు రష్యన్లు మరణించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.   అయితే,  ఈ మృతిపై పోలీసులు ఎటువంటి ఆధారం సేకరించలేక పోతున్నారు. 

ఈ నెల 22వ తేదీన ఇదే హోటట్‌లో బస చేస్తున్న వ్లాదిమిర్ బిదనోవ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆ డిప్రెషన్‌తోనే పావెల్ మృతిచెంది ఉండారని భావిస్తున్నారు. హోటల్‌లోని మూడో అంతస్థు కిటకీలోంచి దూకి ఆంటోవ్ ఆత్మ హత్యాప్రయత్నం చేశాడని, ఆయన భారతీయ గైడ్ హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడికి చేరిన కొద్ది సేపటికి ఆయన మరణించారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

`ఈ నెల 21న నలుగురు రష్యన్లు రాయగడలోని హోటల్‌లో బస చేసేందుకు వచ్చారు. 22వ తేదీ ఉదయం వారిలో ఒకరైన వ్లాదిమిర్ బిదనోవ్ చనిపోయి కనిపించారు. పోస్టుమార్టం తర్వాత ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది. ఆయన మృతి తర్వాత ఆయన స్నేహితుడు పావెల్ ఆంటోవ్ కూడా డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ నెల 25న ఆయన కూడా చనిపోయాడు’ అని రాయగడ ఎస్‌పి వివేకానంద శర్మ తెలిపారు.

కాగా ఈ నెల 21న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో నలుగురు రష్యన్లు తమ ట్రావెల్ ఏజంట్‌తో కలిసి తమ హోటల్‌లో బస చేయడం కోసం వచ్చారని, ఆ సమయంలో వారంతా తాగి ఉన్నారని, లిక్కర్ బాటిళ్లు కూడా ఉన్నాయని, తమ బార్‌నుంచి మరికొన్ని బాటిళ్లను కూడా తెప్పించుకున్నారని టూరిస్టు గైడ్ జితేంద్ర సింగ్ చెప్పారు.

కాగా ఒడిశాలో ఇద్దరు రష్యన్ల మృతి పట్ల ఆరా తీస్తున్నామని రష్యా ఎంబసీ తెలిపింది. వ్లాదిమిర్ ఓబ్లాస్ట్ అసెంబ్లీలో పావెల్ సభ్యుడని, మృతుల బంధువులతో టచ్‌లో ఉన్నామని, ఇప్పటివరకు ఈ రెండు మరణాల్లో క్రిమినల్ కోణం బైట పడలేదని రష్యా ఎంబసీ తెలిపింది.