తెలంగాణ ప్రభుత్వ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోండి

 తెలంగాణ ప్రభుత్వంచే పంచాయితీ రాజ్ నిధుల దుర్వినియోగ పరుస్తూ, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించడంపై తగు చర్యలు టెస్టుకోవాలని కోరుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ వ్రాసారు. భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ప్రకారం స్థానిక సంస్థల హక్కులను కాపాడేందుకు  దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. ని విజ్ఞప్తి చేస్తున్నాను.
కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలను నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయితీలోని సంక్షేమ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచులకు మాత్రమే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పేరుపై బ్యాంకు ఖాతా తెరిచిందని, గ్రామ పంచాయితీ కమిటీ తీర్మానం ఆధారంగా వీరికి ఆ డబ్బు డ్రా చేసే అధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తుండగా, విడుదల చేస్తున్నది. ఇందులో 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలిన 50 శాతం నిధులు సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలని సంజయ్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తాజా విడత నిధులను తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీలకు విడుదల చేసిన్నట్లు ఆయా గ్రామ సర్పంచులకు తెలిపారని చెప్పారు. అయితే  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సర్పంచులు, ఉప సర్పంచులకు తెలియకుండా, వారి బ్యాంకు ఖాతాల డిజిటల్ కీ ఆధారంగా ఈ నిధులను విత్ డ్రా చేశారని సంజయ్ ఆరోపించారు. 
 
ఆ మొత్తాలను కరెంటు బిల్లుల బకాయిలు, ఇతర బిల్లులకు అడ్వాన్సులు చెల్లించారని తెలిపారు. పైపెచ్చు నిబంధనలకు విరుద్ధమైన పాత బకాయిలు చెల్లించేందుకు ఈ నిధులు వినియోగించినట్టు తెలుస్తున్నదని సంజయ్ విమర్శించారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు చెందిన సర్పంచులు తనను కలిసి, ఈ నిధులు తిరిగి తమ ఖాతాలో జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించారని ఆయన చెప్పారు. 
 
గ్రామ పంచాయితీలకు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడం తెలంగాణ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.  ఇటీవలె గ్రామీణ ఉపాధి హామీ పధకం  నిధులను కూడా దారి మళ్లించి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వినియోగించినట్టు తన దృష్టికి వచ్చిందని సంజయ్ ఆరోపించారు.