కేసీఆర్ కు ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును  సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం  (సిట్)ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ పారదర్శకంగా జరగట్లేదని కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని వారు పిటిషన్‌లో కోరారు. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.  ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న  న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించింది.
 కాగా.. హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో బీజేపీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సాంకేతిక ఆధారాలతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. మిగిలిన పిటిషన్లను విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టిఆర్ఎస్  ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
ఆ ఎమ్మెల్యేలలో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్నారు. అయితే  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి  కుట్ర పన్నిందని టిఆర్ఎస్  నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్  కొత్త కుట్రకు పూనుకున్నాడని బిజెపి  నాయకులు విమర్శిస్తున్నారు.
 
మొదటి నుంచి ఈ కేసును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ తెలంగాణ   సర్కార్ ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి దర్యాప్తులో భాగంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 
 
ఇక తాజాగా ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో పెద్ద మలుపుకు చోటు చేసుకుంది. మరోవంక, ఈ కేసులో ఇటీవల ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు నేడు నిందితునిగా ఉన్న నందకుమార్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు.  ఓ వైపు ఈడీ విచారణ, ఇటు సీబీఐకి కేసు అప్పగించడంతో ఇంకెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.