తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ప్రపంచ చాంపియన్‌, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2022లో  సత్తా చాటింది.  జాతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచి 2022వ ఏడాదిని ఘనంగా ముగించింది.  మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్‌, రైల్వేస్‌ బాక్సర్‌ అనామికతో  అమీతుమీ తేల్చుకుంది.
ఫైనల్‌లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌… ప్రత్యర్థి అనామిక(రైల్వేస్‌)కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 4-1 తేడాతో గెలుపొందింది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన నిఖత్‌ కు అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.  
 
ఆదివారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో ఆలిండియా పోలీస్‌ (ఏజీపీ) జట్టు బాక్సర్‌ శివేందర్‌ కూర్‌ సిద్ధూను నిఖత్ చిత్తు చేసింది.  ఐదు రౌండ్లలో కేవలం చివరి దాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకో కలిగింది. దీంతో పసిడి పోరుకు చేరుకుంది. 
 
ఇక ఫైనల్లో ఇదే జోరును కొనసాగించిన నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టి…బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ గెలిచిన నిఖత్ అజేయంగా నిలిచినట్టయింది.  ఈ ఏడాది మొదట్లో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో నిఖత్ స్వర్ణాన్ని సాధించింది. ఆ  తర్వాత  కామన్‌వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నిఖత్ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే.