చైనా ఆర్మీ చొరబాట్లు హిమాలయన్ గోల్డ్ కోసమా!

భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ను కంబళించేందుకు చాలాకాలంగా చైనా ప్రయత్నిస్తుండటం సైనిక, వ్యూహాత్మక కారణాలతోనే జరుపుతున్న దురాక్రమణ యత్నంగా భావిస్తూ వస్తున్నాము.  అయితే, తాజాగా ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్సీ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం హిమాలయన్ వయాగ్రాగా పిలిచే  ‘హిమాలయన్ గోల్డ్’ కోసం అని వెల్లడవుతుంది.
 
పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్  అని పిలుస్తారు. దీనికి చైనాలో బంగారం కంటే ఎక్కువ రేటు ఉందని ఐపీసీఎస్సీ నివేదికలో ప్రస్తావించారు.  దీని ప్రకారం..  హిమాలయన్ గోల్డ్ .. దాని పేరుకు తగ్గట్టుగానే ఇది భారత్ పరిధిలోని హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది. 
 
మరోవైపు చైనా పరిధిలోని నైరుతి ప్రాంతంలో ఉండే క్వింఘాయ్, టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన ప్రదేశాల్లో కూడా హిమాలయన్ గోల్డ్ దొరుకుతుంది.  10 గ్రాముల హిమాలయన్ గోల్డ్ ధర రూ.56 వేల దాకా ఉంటుందని ఒక అంచనా.  ఇందులోనూ మేలి రకం హిమాలయన్ గోల్డ్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నివేదిక అంచనా వేసింది. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా హిమాలయన్ గోల్డ్ ను ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశం చైనానే.  గత రెండేళ్ల వ్యవధిలో చైనాలోని క్వింఘాయ్ ప్రాంతంలో హిమాలయన్ గోల్డ్ సాగు గణనీయంగా తగ్గిపోయింది. 2017లో చైనాలో 43,500 కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరగగా, 2018లో ఇది కాస్తా 41,200 కేజీలకు తగ్గింది. 
 
ఇక అంతకుముందు 2011 సంవత్సరంలో చైనా పరిధిలో అత్యధికంగా 1.50 లక్షల కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరిగింది. ఈ లెక్కన గత 10 ఏళ్లలో చైనాలో దీని సాగు దాదాపు  నాలుగు వంతులు తగ్గిపోయింది. దీంతో హిమాలయన్ గోల్డ్ సాగుకు అనువైన భూమిని దక్కించుకునే క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని హిమాలయన్ ప్రాంతాలపై చైనా కన్నేసిందని ఈ నివేదిక తెలిపింది.
కార్డిసెప్స్‌ విలువ 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1072.50 మిలియన్లుగా ఉంది. వీటిని అన్వేషించే క్రమంలోనే పీఎల్‌ఏ బలగా లు తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో అరుణాచల్ సరిహద్దుల్లో  డ్రాగన్ సైన్యం ఆగడాలు మితిమీరాయని పేర్కొంది.
మరో కీలకమైన విషయం ఏమిటంటే  హిమాలయాల్లోని కొన్ని పట్టణాలు జీవనోపాధి కోసం ఈ ఫంగస్‌ను సేక రించి విక్రయిస్తుంటాయి.  టిబెటన్‌ పీఠ భూమి, హిమాలయాలలోని గృహ ఆదాయంలో 80శాతం ఈ ఫంగస్‌ నుంచే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈశాన్యంలోని భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతం వివిధ రకాల మొక్కలు, విలువైన పంటలకు సారవంతమైనది. 
స్థానికులు కూడా ఇలాంటి వాటిని అన్వేషిస్తూ, పొరబాటుగా దారితప్పి ప్రత్యర్థి సైనికుల నిర్బంధంలోకి వెళ్తుంటారు. అనేక మంది స్థానికులు కూడా భారతీయ సైన్యం ద్వారా పోర్టర్లను కలిగివున్నారు. కొన్నిసార్లు మూలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించే ఇతర వస్తువులను సేకరించేందుకు స్థానికులు రోజుల తరబడి అన్వేషణలు సాగిస్తుంటారు.