ఎమ్యెల్యేల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు ప్రభుత్వంకు చెంపపెట్టు 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ తెలంగాణ  హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వాగతించారు.  కల్పితమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ధ్వజమెత్తారు. 
 
 కేసీఆర్ అబద్ధాలను హైకోర్టు పూర్తిగా ఎండగట్టిందని చెబుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండడంతో, ఆయనే ఈ ఎపిసోడ్ ను సృష్టించారన్న బిజెపి ఆరోపణలు నిజమని ఈ తీర్పు రుజువు చేస్తోందని స్పష్టం చేశారు. 
 
నీతి నిజాయితీలకు కట్టుబడిన జాతీయ నాయకులను ఈ వ్యవహారంలోకి లాగి కేసీఆర్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి విమర్శించారు. అతని ఊహల్లోంచి పుట్టిన ఈ తప్పుడు కేసు కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. అంతేకాకుండా అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 
 
ఐపీఎస్‌ అధికారులు వాస్తవాలను వెల్లడించకపోవడం దురదృష్టకరం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అధికారం చేతిలో పెట్టకొని ఏమైనా చేయొచ్చనుకునే కేసీఆర్ లాంటి వాళ్లకు ఈ తీర్పు కళ్లు తెరిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయని, బెదిరింపులకు లొంగవని స్పష్టం చేశారు. 
 
స్వాగతించిన బండి సంజయ్ 

 
నలుగురు ఎమ్మెల్యేల ఫాంహౌజ్ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం సీబీఐకి అప్పగించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. ఈ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి అసత్య ప్రచారంతో బీజేపీని బదనాం చేసే కుట్రకు తెరదీసిందని ధ్వజమెత్తారు.
 
ఫాంహౌజ్ కేసులో కర్త, కర్మ, క్రియ ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ కు ‘ప్రగతి భవన్’ అడ్డగా మారిందని సంజయ్ విమర్శించారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. 
 
నేరస్తులను కాపాడటానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కన్పిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక కేసులపై ‘సిట్’ విచారణ జరిపినా కనీసం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. 
 
అభివ్రుద్ది గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి లేదని సంజయ్ దుయ్యబట్టారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయిన తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు, ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథ ఫాంహౌజ్ కేసు అని ఆరోపించారు. 
 
ఫాంహౌజ్ కేసులో దోషులెవరో గుర్తించడానికి సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారని చెబుతూ సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందని తెలిపారు.