ఎన్టీఆర్‌ భోళా మనిషి అందుకే వెన్నుపోటుకు గురయ్యారు

కీర్తిశేషులు ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భోళా మనిషని అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక చెప్పారు. శనివారం తెనాలిలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయారని తెలిపారు. 

ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి పని చేసిన ఎన్టీఆర్ అందరిని నమ్మేవారని చెప్పారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో నిశబ్ద విప్లవాన్ని తెచ్చారని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారని కొనియాడారు.

అటు సినీరంగంలోనూ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరని పేర్కొంటూ బడుగు, బలహీనవర్గాలకు, మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని, అవి సరిగా అమలవుతున్నాయో లేదో స్వయంగా ఆయనే తెలుసుకునేవారని చెప్పారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం చూసి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను గౌరవించేవారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా ధృడమైన జాతీయవాది అని చెబుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయవాదంతో సమ్మిళితం చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ  కూడా పాల్గొన్నారు.

ఎన్‌టిఆర్‌ శతాబ్ధి చలనచిత్ర పురస్కారాలను జయభేరి సంస్థ అధినేత, నిర్మాత, దర్శకులు, నటులు మాగంటి మురళీమోహన్‌, నటి జయచిత్రకు ఎన్‌టిఆర్‌ కుటుంబసభ్యులు ఈ సందర్భంగా  ప్రదానం చేశారు. ఎన్టీఆర్ శతదినోత్సవంలో భాగంగా రచయిత సురేష్ రాసిన మహాత్మగాంధీ పుస్తకాన్ని జస్టిస్ రాధారాణితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.