అప్పుల ఊబిలో దేశంలో మొదటి స్థానంలో ఏపీ రైతులు

దేశం మొత్తం మీద అప్పుల ఊబిలో చిక్కుకు పోయిన రైతులలో రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్నదాతలు ముందు వరుసలో ఉన్నారు. అయితే ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రైతులు  ఐదవ స్థానంలో ఉన్నారు. జాతీయ స్థాయిలో 57 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకు పోగా,  తెలంగాణ లో 91.7 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 93.2 శాతం మంది రైతులు రుణభారంతో చిక్కుకు  పోయారు. 

తెలంగాణలో ఒక రైతు కుటుంబం సగటు రుణం రూ. లక్షా 52 వేల 011గా వుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఆ మొత్తం రూ. రెండు లక్షల 45వేల 554 గా వుంది. జాతీయ గణాంక కార్యాలయం సర్వే ప్రకారం దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు రూ. 74,121కు చేరింది.

పదేళ్ల క్రితం ఆ మొత్తం కేవలం రూ. 47,000 మాత్రమే వుంది. అంటే దశాబ్దకాలం లో రైతులపై రుణభారం దాదాపు 57 శాతం అధికమైంది. రుణ ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య దేశవ్యాప్తంగా 51.9 శాతం నుంచి 50.2 శాతంకు తగ్గినప్పటికీ రుణ మొత్తం పెరగటం ఆందోళన కలిగించే అంశమే.

అన్నదాతల అత్యధిక రుణం వున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ, పంజాబ్, రాష్ట్రాలు వున్నాయి. కేరళలో ఒక్కో రైతు కుటుంబంపై సగటు రుణ భారం రూ. 2,42,482 వుంటే, పంజాబ్ లో రూ. 2,03,259గా వుంది. తెలంగాణ 5 వ స్థానం లో వుంది.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకుకు, సొసైటీ లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించే సంస్థాగత రుణ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది.

సంస్థాగత రుణాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది. దేశవ్యాప్తంగా సంస్థాగత రుణాలు సగటున 69.6 శాతం మందికి అందుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 49.6 శాతం, తెలంగాణ లో 42.5 శాతం మందికి మాత్రమే సంస్థాగత రుణాలు అందుతున్నాయి. దీంతో రైతులకు వ్యవసాయ పెట్టుబడులు, ఇతర కుటుంబ అవసరాల కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతున్నది.

వాణిజ్య బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5 శాతం కుటుంబాలకు రుణం అందుతుంది. అయితే ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 34.1 శాతం, తెలంగాణ లో 24.8 శాతం గా మాత్రమే వున్నది. వ్యవసాయ రుణం తీసుకున్న మొత్తం నుంచి కేవలం 57.5 శాతం మొత్తాన్ని మాత్రమే వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు సర్వే లో వెల్లడయింది. తెలంగాణ లో 63 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 60.3 శాతం రుణాన్ని వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ సగటు రుణ భారం కంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క కుటుంబంపై 221 శాతం, తెలంగాణలో 105 శాతం అధికంగా వుండటం గమనార్హం.