చైనాలో కరోనా ప‌రిస్థితిపై డ‌బ్ల్యూహెచ్‌వో అసహనం

చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, ఈ విషయమై అక్కడి ప్రభుత్వ ధోరణి పట్ల ఓ విధంగా సహనం వ్యక్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. 
“చైనా తమ డేటా మాకు ఇస్తుందనీ. మేము కోరిన అధ్యయనాలు జరుపుతుందని ఇప్పటికీ ఆశిస్తూనే ఉన్నాం. దీనిపై తరచూ విన్నపాలు చేస్తూనే ఉంటాం. నేను ఇదివరకు చాలా సార్లు చెప్పినట్లు.. ఈ కరోనా ఎక్కడి నుంచి పుట్టింది అనే అంశంపై ఉన్న ఊహాగానాలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి” అని టెడ్రోస్ ఒక విధంగా   చైనా ధోరణిపై అసహనం వ్యక్తం చేశారు. 

 ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, ఇంటెన్సివ్ కేర్ అవ‌స‌రాల గురించి డ్రాగన్ దేశం వెల్ల‌డించాల‌ని ఆయ‌న తెలిపారు. వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌పై ఫోక‌స్ చేసే రీతిలో చైనాకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు టెడ్రోస్ చెప్పారు. 

“ఈ కొత్త వేరియంట్ వల్ల ముప్పు ఎలా ఉంటుందో కచ్చితమైన అంచనా వెయ్యాలంటే.. మాకు సరైన సమాచారం కావాలి. మృతులు ఏ స్థాయిలో ఉన్నారో తెలియాలి. ఎంత మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు? ఐసీయూ ఎంత మందికి అవసరం అవుతోందో మాకు తెలియాలి. చైనా తన ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు మేము పూర్తిగా సహకరిస్తున్నాం. చైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మా సాయం కొనసాగిస్తాం” అని టెడ్రోస్ వివరించారు.

ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు 2020 నుంచి జీరో కోవిడ్ పాల‌సీలో భాగంగా క‌ఠిన ఆరోగ్య ఆంక్ష‌ల‌ను చైనా అమ‌లు చేస్తోంది. కానీ ఇటీవ‌ల నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో ఆ ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన విష‌యం తెలిసిందే.
ఇలా ఉండగా, ఇదివరకటితో పోల్చితే.. ఇప్పుడు కరోనాపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న టెడ్రోస్ ప్రస్తుతం ఒమైక్రాన్ తొలిదశలోనే ఉందని తెలిపారు. గత వారం నుంచి చైనాలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 
 
రాజధాని బీజింగ్‌లో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయనీ  ఎక్కడికక్కడ మృతులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీ వార్డులన్నీ నిండిపోవడంతో నేలపైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారనే వాదన ఉంది. చైనా మాత్రం కరోనా కేసులు, మరణాలను చాలా తక్కువగా చెబుతోంది. 
 
నిన్న ఆ దేశంలో కొత్త కేసులు 3,101 కాగా.. ఎవరూ చనిపోలేదని తెలిసింది. ప్రస్తుతం ఆ దేశంలో యాక్టివ్ కేసులు 37,180 ఉన్నట్లు తెలిసింది. ఐతే.. ఈ లెక్కలు ఎంతవరకూ నిజం అన్నది చైనాకే తెలియాలి.