నేపాల్‌ ప్రధానిగా మరోసారి షేర్‌ బహదూర్‌ దేబా

నేపాల్‌ ప్రధాన మంత్రి షేర్‌ బహదూర్‌ దేబాను ప్రధాని అభ్యర్థిగా అధికార నేపాలీ కాంగ్రెస్‌ గురువారం ప్రకటించింది.  రికార్డు స్థాయిలో ఐదుసార్లు దేశ  ప్రధానిగా  బాధ్యతలు చేపట్టిన  దేబా  మరోసారి ప్రధాని కానున్నారు.  బుధవారం ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేబా, తన ప్రత్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి గగన్‌ కుమార్‌ థాపాపై 39 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.  దేబాకి 64 ఓట్లు లభించగా, థాపాకి కేవలం 25 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. పార్టీకి చెందిన మొత్తం 89 మంది పార్టీ ఎంపిలు ఓటింగ్‌లో పాల్గొన్నారని  పేర్కొన్నారు.
దీంతో కొత్త ప్రభుత్వంలో ప్రధాని పదవికి దేబా పాలక పార్టీ అభ్యర్ధిగా కానున్నట్లు పార్టీ ప్రకటించింది.  ఈ సందర్భంగా పార్టీ ఎంపిలకు దేబా కృతజ్ఞతలు తెలిపారు. తాను గెలిచేందుకు అందరూ సహకరించారని, ఇందుకు కృతజ్ఞతలని చెప్పారు.  రాబోయే రోజుల్లో పార్టీని ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుండి నడిపిస్తానని తెలిపారు. నేపాల్‌లో నవంబర్‌ 20న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌ అత్యధిక మెజారిటీ సాధించిన ఏకైక పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.