ఏపీలో స్కూళ్ళ అభివృద్ధికి రూ.867 కోట్లు

సమగ్ర శిక్షా పథకం కింద 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాలు మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు  విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.
కేంద్రం విడుదల చేసిన నిధులలో ఈ ఏడాది డిసెంబర్‌ 15 నాటికి  823 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించిందని చెప్పారు.
సమగ్ర శిక్షా పథకం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న అత్యుత్తమ చర్యలు, వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుకరించేందుకు వీలుగా పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు “షాగన్ డిజిటల్  రెపోసిటొరీ” వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సమగ్ర శిక్షా పథకం కింద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డేటా బేస్ ద్వారా లోపాలను గుర్తించి నిర్ణయించిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన వినతుల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు.
 అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి ఏటా కసరత్తు చేస్తాయని, అవి ఆయా రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికలోను, బడ్జెట్‌లోను ప్రతిబింబిస్తాయని మంత్రి వివరించారు.