కాపు రిజర్వేషన్ చట్టబద్ధమే … కేంద్రం స్పష్టం

చంద్రబాబు నాయుడు సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్ చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని స్పష్టత ఇచ్చింది.  రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్  ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని వివరించింది.
అయితే 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం  సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చునని కేంద్రం పేర్కొంది. 
 
మరోపక్క 103వ రాజ్యాంగ సవరణ చట్టం -2019 ద్వారా రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని ప్రస్తావించింది. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం అవసరం లేదని, కేంద్రం పాత్ర ఏమీలేదని ఈ  సమాధానంలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. 
 
కాగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా, ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఇచ్చిన స్పష్టత పట్ల జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 
కొన్ని నెలల క్రితం కాపు రిజర్వేషన్ అంశాన్ని బిజెపి  ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం కాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని,  కావున వారికి రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. 
 
ఏపీ జనాభాలో 18 శాతం ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని, రాష్ట్ర అభివృద్ధిలో కాపులు విశేషంగా కృషి చేశారని ఆయన చెప్పారు.  బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారని పేర్కొన్నారు. 
 
1956 నుంచి రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయని జీవీఎల్ ధ్వజమెత్తారు. విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని, ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం రాజకీయ ఆందోళనలు చేస్తూనే వున్నారని తెలిపారు.