ఢిల్లీలో కవిత మీటింగుల వెనక ఉన్న మతలబు ఏమిటి?

లిక్కర్​ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందని  తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ చెబుతూ ఈ మీటింగుల వెనక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. సమీర్ మహీంద్రుతో ఆమెకు ఉన్న సంబంధాలేంటో కూడా తెలియాలని డిమాండ్ చేశారు.

మద్యం కుంభకోణం ఛార్జ్ షీట్ లో మరోసారి కవిత పేరు బయట పడిందని గుర్తు చేశారు. తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం దోపిడీ, ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని ఆయన విమర్శించారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు వెల్లడవుతాయని, వీరందరికీ కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు.

సమీర్ మహీంద్రుతో కలిసి లిక్కర్​ స్కాం ద్వారా కవిత దోపిడీ చేశారన్న ఆయన ఈ అంశంలో కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.

చార్జి షీట్ లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు. కవిత ఎందుకు ఎన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని కోరారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని, అసలు సమీర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు.

ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్న వారంతా కవిత ఇంటికి ఎందుకు వచ్చారంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణల నుంచి బయట పడేందుకే పార్టీ పేరును బీఆర్​ఎస్​ గా కేసీఆర్​ మార్చుకున్నారని బిజెపి నేత ఆరోపించారు.

పంజాబ్ సీఎం భగవంతు మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందరూ లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపణలు చేశారు. కుటుంబవాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్ ఈ ప్రణాళికలో భాగంగానే అరవింద్​ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లను కలిశారని ఆరోపించారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమేనన్న తరుణ్ చుగ్  దాని వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని విమర్శించారు.