తెలంగాణాలో ఉపాధి పథకం నిధుల మల్లింపు నిజమే.. కేంద్రం స్పష్టం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లించిన మాట నిజమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ (మల్కాజిగిరి) రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

 తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించేందుకు 2022 జూన్‌లో కేంద్ర బృందం పర్యటించిందని తెలిపారు. దారి మళ్లించిన నిధులు మొత్తం రూ. 151.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికవరీ చేయాలని ఆ కేంద్ర బృందం సిఫారసు చేసిందని చెప్పారు. 

ఉపాధి హామీ పథకం కింద అనుమతి లేని పనులైన ఆహార ధాన్యాలు ఎండబెట్టే ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర బృందం ఇంకా అనేక అవకతవకలను గుర్తించిందని ఆమె వివరించారు. చాలా తక్కువ మందికి ప్రయోజనం కలిగే పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర బృందం పేర్కొంది.

పూడిక తీత వంటి పనులకు ఉపాధి నిధులు ఎక్కువగా ఖర్చు చేశారని, కానీ పనుల ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరలేదని కేంద్ర బృందం తెలిపింది. అలాగే ఉపాధి హామీ పనుల రికార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయలేదని వెల్లడించింది.

కేంద్ర బృందం పర్యటించిన 7 గ్రామాల్లోనూ గ్రామపంచాయితీ రిజిస్టర్లలో సరైన వివరాలు లేవని కేంద్ర బృందం తన నివేదికలో పొందుపరిచింది. మరోవైపు మార్గదర్శకాల ప్రకారం పనులు పూర్తిచేసిన చోట, నిర్మాణంలో ఉన్న చోట ‘సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు’ ఏర్పాటు చేయలేదని పేర్కొంది. 

తెలంగాణకు  356 రోడ్డు ప్రాజెక్టుల కేటాయింపు 

కాగా, తెలంగాణ రాష్ట్రానికి ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ (పిఎంజిఎఎస్ వై)-3  కింద 2020-21 నుంచి ఇప్పటి వరకు 2,427.50 కి.మీ పొడవైన 356 రోడ్డు ప్రాజెక్టులకు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీలు జి. రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి కేటాయించిన మొత్తం రోడ్లలో 2,395.84 కి.మీ రోడ్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు.

ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన మార్గదర్శకాల ప్రకారం టెండర్లు పిలవడం, పనులు పూర్తి చేయడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి వెల్లడించారు. అలాగే మంజూరు చేసిన 12 నెలల్లోగా రోడ్ ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

 అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని రోడ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. మొత్తం మంజూరైన రోడ్లలో 1,066 కి.మీ పొడవైన 75 రోడ్ ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు.