చైనా, పలు దేశాలలో కరోనా నాలుగో వేవ్?..  భారత్ అప్రమత్తం 

చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ మ‌ళ్లీ కోర‌లు చాస్తోంది. దీంతో అంత‌టా ఆందోళన మొద‌ల‌య్యింది. ఇది కరోనా  ఫోర్త్ వేవ్ కు సంకేతాలు కావొచ్చని, జాగ్రత్తగా ఉండాలని వైద్య‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు ఏ వేరియంట్ అన్నది తెలుసుకోవాలని నిర్దేశించింది.

ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఈ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్న విషయం అర్థమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని సూచించారు.

ప్రపంచదేశాల్లో మరోసారి కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఆరోగ్య ఉన్నతాధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత రాష్ట్రాలకు మరిన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. 

రెండో వేవ్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త కేసులు రావ‌డంతో చైనా జీరో కొవిడ్ పాల‌సీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసింది. అయితే, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో జీరో కోవిడ్ పాల‌సీని స‌డ‌లించింది. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. దాంతో అక్క‌డి ఆస్ప‌త్రులు క‌రోనా పేషెంట్ల‌తో నిండిపోతున్నాయి.

క‌రోనా సోకిన‌వాళ్ల‌తో కిక్కిరిసిన చైనా ఆస్ప‌త్ర‌లు ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 3 నెలల్లోనే చైనాలోని 60 శాతం మంది క‌రోనా బారిన ప‌డ్డారు. జ‌న‌వ‌రి నుంచి ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు రెండో వేవ్, ఫిబ్ర‌వ‌రి చివ‌రి నుంచి మార్చి 15 వ‌ర‌కు మూడో వేవ్ ప్రారంభం అవుతుంద‌ని వైద్యులు చెప్తున్నారు.

గత రెండు నెలలుగా భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం భారతదేశంలో కేవలం 112 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 3,490కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి

ఆదివారం (డిసెంబర్ 18)తో ముగిసిన వారంలో, దేశంలో కేవలం 12 మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020లో రోజువారీ కరోనా మరణాలు నివేదించడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతి తక్కువ. దేశంలో మూడు రోజులలో సున్నా మరణాలు నమోదయ్యాయి. అలాగే, వారంలో భారతదేశంలో కనుగొనబడిన కేసులు 1,103కి పడిపోయాయి — మార్చి 23-29, 2020 నుంచి దేశవ్యాప్తంగా మొదటి లాక్‌డౌన్ విధించిన తర్వాత ఇది వారంవారీ అత్యల్ప సంఖ్య.

చైనాకు పెను ముప్పు 

కరోనా వైర్‌సకు పుట్టునిల్లయిన చైనాలో రానున్న మూణ్నెల్లలో కరోనా విలయతాండవం చేసి, ఆ దేశ జనాభాలో 60ు మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్‌ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్‌ ఫీగ్ల్‌-డింగ్‌ అంచనా వేశారు. కేసుల డబ్లింగ్‌ దశ (రోజువారీ రెట్టింపు) మరెంతో దూరంలో లేదని, కొద్ది రోజుల్లోనే ఆ పరిస్థితిని చైనా ఎదుర్కోనుందని ఆయన హెచ్చరించారు. 

అదే సమయంలో వచ్చే ఏడాది చివర్లోగా చైనాలో కొవిడ్‌తో 10 లక్షల మరణాలు సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) ఇప్పటికే తన అధ్యయనంలో వెల్లడించింది.