మేఘాలయాలో కాంగ్రెస్‌ కు మహిళా ఎమ్యెల్యే రాజీనామా

ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ నెలల ముందు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయా కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకురాలు అయిన డాక్టర్‌ ఎం అంపరీన్‌ లింగ్డో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అంపరీన్‌ రాజీనామా లేఖను పంపించారు.
కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు సేవ చేయడం కోసం తనకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, ఈస్ట్‌ షిల్లాంగ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రజల కోసం పనిచేయడం కాంగ్రెస్‌ పార్టీవల్లే తనకు సాధ్యమైందని రాజీనామా లేఖలో అంపరీన్‌ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితి అంతా బాగాలేదని, స్థానిక నేతలు పార్టీని భ్రష్ఠు పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఏఐసీసీ మాజీ కార్యదర్శి అయిన ఆమె ప్రస్తుతం పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయడం సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో సంబంధం కోల్పోయిందని ఆమె  అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. 

కాగా, కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన ఎమ్యెల్యే మొహిన్ద్రో రాప్సొంగ్ తో కలసి నేషనలిస్ట్ ఫూపుల్స్ పార్టీలో సోమవారం చేరబోతున్నట్లు తెలుస్తున్నది. Meghaమేఘాలయాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపితో సహా ఐదు పార్టీల మేఘాలయ డెమోక్రాటిక్ అలయన్స్ లో ఈ పార్టీ కూడా  భాగస్వామి.