చైనాకు తిరిగి వెళ్లబోను.. దలైలామా

తాను తిరిగి వెళ్లబోనని బౌద్ధ గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామా (86) స్పష్టం చేశారు.  భారత్ ను ఆయన అత్యత్తమ ప్రదేశంగా అభివర్ణిస్తూ చైనాకు తిరిగి వెళ్లడంలో అర్ధం లేదని చెప్పారు. శాశ్వత నివాస హోదాతో హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో దలైలామా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. 
 
టిబెట్ కు చెందిన 14వ దలైలామాగా (మత గురువు) ఆయనకు గుర్తింపు ఉంది. చైనా ఆంక్షలతో 1959 నుంచి భారత్ లోనే ఉంటున్నారు. భారత్‌- చైనాల మధ్య డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో తలెత్తిన సరిహద్దు ఘర్షణ ఘటన తర్వాత దలైలామా సోమవారం మొదటిసారి స్పందించారు. 
 
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రాలో ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘర్షణ గురించి ప్రస్తావించగా  “ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చైనా కూడా మరింత సరళ వైఖరిని అనుసరిస్తోంది. అయినప్పటికీ చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. 
 
“నేను భారత్‌ను ఎంచుకున్నాను. నా ప్రాధాన్యం భారత్ కే. ఇదే ఉత్తమ ప్రదేశం. ‘కాంగ్రా’ నెహ్రూ ఎంపిక. ఇదే నా శాశ్వత స్థానం” అని తెలిపారు.