కర్ణాటకలో హలాల్‌ మాంసంపై నిషేధం

హలాల్‌ మాంసంపై నిషేధం విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కదులుతున్నది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు బస్వరాజ్‌ బొమ్మై ప్రభుత్వం సిద్ధమైంది. సర్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇతర వస్తువులను నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ రవికుమార్ డిమాండ్ చేశారు.

హలాల్ మాంసంపై నిషేధానికి సంబంధించి ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రవికుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు దీనినే సభలో బిల్లుగా సమర్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు అంతా దీనికి అంగీకారం తెలిపారు. ఈ విషయమై మంత్రులు, నేతలతో సీఎం సమావేశమై చర్చించనున్నారు.

వచ్చే ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల లోపుగానే ఈ నిషేధాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కాగా,  హలాల్ మాంసానికి సంబంధించిన ప్రైవేట్‌ బిల్లును ఆమోదించవద్దని అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి అభ్యర్థిస్తామని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌ చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని ఆయన తెలిపారు.