వచ్చే డిసెంబర్ లో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు

దేశంలో మొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు వచ్చే ఏడాది డిసెంబరులో అందుబాటులోకి వస్తుందని   కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.  దేశీయంగా రూపొందించి, నిర్మించిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్ 2023లో అందుబాటులోకి రానుందని మంత్రి పేర్కొన్నారు.

‘‘హైడ్రోజన్ రైలుకు మేము రూపకల్పన చేస్తున్నాం.. డిజైన్ మే లేదా జూన్ నాటికి పూర్తవుతుంది. మేము ప్రపంచ స్థాయి వందే మెట్రోని రూపొందిస్తున్నాం.. ఇది ముందుకు సాగుతుంది.. ఈ వందే మెట్రో రైళ్లను చాలా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నాం.దేశవ్యాప్తంగా 1950, 60ల నాటి డిజైన్లలో ఉన్న రైళ్ల స్థానంలో వీటిని భర్తీ చేస్తాం’’ అని మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని వందే మెట్రోకు రూపకల్పన చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ‘‘ధనవంతులు ఎల్లప్పుడూ తమను తాము తాము చూసుకోగలరు. ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి, పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తున్నారు’’ అని తెలిపారు.

ప్రతి భారతీయుడి జీవితంలో రైల్వేలు భారీ నిర్మాత్మక మార్పులను తీసుకురావాలని ప్రధాని కోరుకుంటున్నారని అశ్విని వైష్ణవ్ వివరించారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్ల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. వందే భారత్ వంటి రైళ్లకు భారతీయ ఇంజినీర్లు రూపకల్పన చేస్తున్నారని చెప్పారు.

రైల్వే ప్రయివేటీకరణపై కూడా స్పందిస్తూ రైల్వేలు వ్యూహాత్మక విభాగమని, ఇవి ప్రభుత్వ అధీనంలో ఉంటుందని తెలిపారు. స్లీపర్ కోచ్‌లతో ఉండే వందే భారత్-3 డిజైన్‌ల రూపకల్పన జరుగుతోందన్నారు. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ రైళ్లను వినియోగించనున్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. రోజుకు సగటున 12 కి.మీ. ట్రాక్ నిర్మాణం జరుగుతుంటే, అదే యూపీఏ అధికారంలో ఉన్న 2004-20014 మధ్య రోజుకు సగటున 4 కి.మీ. కంటే తక్కువే జరిగేందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి ఇది 16 నుంచి 17 కి.మీ.కు చేరుకుంటుందని, ప్రధాని మాత్రం 20 కి.మీ. లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు.