26 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

2022-23 ఆర్ధిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 26 శాతం పెరిగి, 13,63,649 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్‌ తరువాత నికర వసూళ్లు 11,35,754 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10,83,150 కోట్లు ఉన్నాయి. రిఫండ్స్‌ తరువాత నికర వసూళ్లు 9,47,959 కోట్లుగా ఉన్నాయి.
2022 డిసెంబర్‌ 17 నాటికి 2,27,896 కోట్లు రిఫండ్‌ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం రిఫండ్స్‌ 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ సారి రిఫండ్స్‌ 68 శాతం పెరిగినట్లు సీబీడీటీ తెలిపింది. మొత్తం 13,63,649 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పోరేట్‌ ట్యాక్స్‌(సీఐటీ) 7,25,036 కోట్లుగా ఉన్నాయి.
వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యురిటీల లావాదేవీల పన్నులు కలిపి 6,35,920 కోట్లుగా ఉన్నట్లు బోర్డు తెలిపింది. వసూలైన పన్నుల్లో 5,21,302 కోట్లు అడ్వాన్స్‌ ట్యాక్స్‌, టీడీఎస్‌ ద్వారా వచ్చినవి 6,44,761 కోట్లు, సెల్ఫ్‌ అసెసెమెంట్‌ ట్యాక్స్‌ 1,40,105 కోట్లు, రెగ్యూలర్‌ అసెసెమెంట్‌ ట్యాక్స్‌ 46,244 కోట్లు, ఇతర మైనర్‌ హెడ్స్‌ నుంచి వచ్చిన పన్నులు 11,237 కోట్లుగా ఉన్నాయి.
మొత్తం మూడు త్రైమాసికాల్లో వచ్చిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌లు ఈ డిసెంబర్‌ 17 నాటికి 5.21 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపింది. గత సంవత్సరం వచ్చిన 4.62 లక్షల కోట్లతో పోల్చితే ఇది 12.83 శాతం అధికం. గతంతో పోల్చితే ఈ సారి ఆదాయ పన్ను రిటర్న్స్‌ ను ప్రాసెస్‌ను వేగంగా పూర్తి చేసినట్లు తెలిపింది. డిసెంబర్‌ 17 నాటికి 96.5 శాతం ప్రాసెస్‌ను పూర్తి చేసినట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది.
దీని వల్ల రిఫండ్స్‌ ఇచ్చే వేగం 109 శాతం పెరిగిందని పేర్కొంది. 12 శాతం పెరిగిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 17 వరకు కార్పోరేట్‌, వ్యక్తిగత ఆదాయ పన్నుల అడ్వాన్స్‌ వసూళ్లలో 12.83 శాతం పెరుగుదలతో 5,21,302 కోట్లు వసూలైనట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. గత సంవత్సరం ఇది 4.62 లక్షల కోట్లుగా ఉంది.
 ఇందులో కార్పొరేట్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 3.97 లక్షల కోట్లుగా ఉంది. వ్యక్తిగత ఆదాయపు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 1.23 లక్షల కోట్లుగా ఉంది. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను 4 వాయిదాల్లో చెల్లిస్తుంటారు. జూన్‌ 15 లోపుగా 15 శాతం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను , సెప్టెంబర్‌ 15 లోపుగా 30 శాతం, డిసెంబర్‌ 15లోగా 30 శాతం, మిగిలిదాన్ని మార్చి 15లోగా చెల్లించాల్సి ఉంటుంది.