‘లేపాక్షి’కి యునెస్కో గుర్తింపుకై జాతీయ సదస్సు పిలుపు 

‘లేపాక్షి వీరభద్రాలయ వైభవం – యునెస్కో శాశ్వత గుర్తింపు’ అనే అంశంపై రెండు రోజుల పాటు లేపాక్షి,  హిందూపురంలలో జరిగిన జాతీయ సదస్సులో వీరభద్రాలయానికి వన్నె తెచ్చే విధంగా పలువురు పరిశోధకులు పలు అంశాలపై మాట్లాడుతూ ‘లేపాక్షికి యునెస్కో గుర్తింపు’ కోసం ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
 
వివిధ విశ్వ విద్యాలయాట, కళాశాలల నుంచి వచ్చిన యాభై మందికి పైగా పరిశోధకులు, విద్యార్థులు పరిశోధన పత్రాలు, వ్యాసాలు సమర్పించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయానికి చెందిన సాద్విక లేపాక్షిని పర్యాటక వలయాలతో అనుసంధానం చేయడం ద్వారా సాధించే ప్రగతి గురించి వివరించారు. 
 
ఎస్వి యూనివర్సిటీ అధ్యాపకుడు డా. తిమ్మరాజు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు – తీరుతెన్నులు అభివృద్ధి గురించి తన పత్రంలో పేర్కొన్నారు. ప్రముఖ చరిత్ర కారుడు ప్రొఫెసర్ నరసింహన్ లేపాక్షి వీరభద్రు సన్నిధి విశేషాలు – శాసనాలపై విపులంగా చర్చించారు. ‘యునెస్కో’ గుర్తింపు పొందడానికి వీరభద్రాలయ సముదాయానికి అన్ని అర్హతలున్నాయని జాతీయ సదస్సు సంచాలకుడు మైనాస్వామి తెలిపారు. 
 
ఆసియాలో అతిపెద్ద త్తెల వర్ణచిత్రం, దేశంలో పెద్ద నంది, ఆకాశ స్తంభం వంటివి లేపాక్షి విశిష్టతలను తెలుపుతున్నామని కొలతలతో సహా ఆయన వివరించారు. ఆ విషయాల గురించి ఆసక్తిగా తెలుసుకొన్న ఎస్వి భక్తి చానెల్ డైరెక్టర్ డా. వసంత కవిత యునెస్కో గుర్తింపున కోసం కృషి చేస్తానని చెప్పారు. 
 
యునెస్కో గుర్తింపునకై చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర పర్యాటక- సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో తాను ప్రత్యక్షంగా మాట్లాడుతానని ఎ.పి.టి.డి.సి. పూర్వ అధ్యక్షుకు చెన్నురు ఆంజనేయ రెడ్డి చెప్పడంలో సదస్సులో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. 
 
అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం పర్యాటక యాజమాన్య శాఖ విద్యార్థులు యునెస్కో గుర్తింపు-లేపాక్షి, ఆర్థిక అభివృద్ధిపై పత్రాలు సమర్పించారు. యునెస్కో గుర్తింపుతో లేపాక్షి ప్రాంతం మౌలిక సదుపాయాలతో పాటు, ఆర్ధిక ప్రగతి కూడా సాధిస్తుందని ఇండియా టూరిజం సహాయ సంచాలకుడు సి.వి. శంకరరెడ్డి పేర్కొన్నారు.. 
 
ఆకట్టుకొన్న నృత్యాలు
 
అనంతపురం శుభోదయ నృత్య అకాడెమీ వారు ప్రదర్శించిన ‘ దక్షయజ్ఞం రూపకం’ సభికులను మంత్రముగ్ధులను చేసింది. లేపాక్షి వీరభద్రాలయం ఆవిర్భావానికి మూలమైన ‘ దక్షయజ్ఞం’ అద్భుతంగా ప్రదర్శితం కావడంతో నాట్య బృంద సభ్యులను నిర్వాహకులు అభినందనలతో ముంచెత్తారు. 
 
లేపాక్షి అసంపూర్ణ కళ్యాణ మండపానికి మూలగాథ.. గిరిజా కళ్యాణం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం నృత్యరూపకం గొప్పగా సాగింది. గోరంట్లకు చెందిన మైలారం వేద ప్రజ్ఞ చేసిన కూచిపూడి నృత్యం పలువురి మన్నలను పొందింది. బెంగుళూరు ‘ ప్రియ సిస్టర్స్ ‘ ప్రదర్శించిన కథక్ నాట్యం కనువిందుగా సాగింది. 
 
లేపాక్షి నవోదయ విద్యార్థులు, గౌరిబిదనూరు, హిందూపురం, చిక్కబళ్ళాపురం, లేపాక్షి తదితర పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థినులు కరాచిపూడి, భరతనాట్యం, శివతాండవం లతో మనోల్లాసం కలిగించారు. సుమారు 60 మంది కళాకారులకు ప్రశంసా పత్రాలతో పాటు లేపాక్షి పుస్తకాన్ని మైనాస్వామి అందించారు. 
 
ముగింపు సభలో  కర్నాటక ప్రభుత్వ మీడియా అకాడమీ అధ్యక్షులు సదాశివ షెనాయ్ మద్దతుతో ‘లేపాక్షికి యునెస్కో గుర్తింపు’ రావడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా పనిచేయాలని సభ తీర్మానించింది. తీర్మానాన్ని సదస్సు సంచాలకుడు మైనాస్వామి ప్రవేశపెట్టగా, కాకతీయ విశ్వ విద్యాలయం ఆచార్యులు డా. విజయబాబు, బాలాజి కళాశాల ప్రిన్సిపాల్ డా. వీరభద్రప్ప, గోరంట్ల కళాశాల ప్రిన్సిపాల్ భక్త వత్సలం తదితరులు బలపరిచారు.