విభజన చట్టంలో అనేక అంశాలను ఇప్పటికే అమలు చేసాం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని అనేక నిబంధనలను ఇప్పటికే అమలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన నిబంధనల అమలు వివిధ దశల్లో ఉందని తెలిపింది. వాటిలో కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యా సంస్థలకు సంబంధించినవని పేర్కొన్నది. 
 
 వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని, పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా పదేళ్ల కాలపరిమితి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 
 
విభజన చట్టంలో భాగంగా హామీల అమలు స్థితి, తెలంగాణ రాష్రం తో ఉన్న విభేదాలు, వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఇప్పటివరకు పరిష్కారానికే జరిగిన చర్యల గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు ఆయన బుధవారం సమాధానమిచ్చారు.
 
విభజన హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 29 సమీక్షా సమావేశాలు నిర్వహించిందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల సహకారంతో మాత్రమే ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకోవచ్చని మంత్రి తెలిపారు.
 
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు, సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఒక్క ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. 
 
అధికార పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీ మధ్య స్నేహపూర్వక రాజకీయ సంబంధాలున్నప్పటికీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వాటిని ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు.