బండి సంజయ్ పాదయాత్ర ఇదో  విడత నేటితో పూర్తి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. 
 
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జీ మురళీధర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సభ సాయంత్రం ముగియనుంది. 
 
ముఖ్యంగా రాష్ట్రంలోని పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా ఈ సభలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించడంతోపాటు వారి రవాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేననే సంకేతాలను పంపాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం వేసింది కరీంనగరే. ఎక్కడైతే కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తుకు అగ్రపీఠం వేసిన కరీంనగర్ లోనే సభను విజయవంతం చేయడం ద్వారా బీఆర్ఎస్ పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని ప్రయత్నిస్తున్నారు.
 
తెలంగాణ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని ఈ సందర్భంగా సంజయ్ పిలుపునిచ్చారు.   కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా సంజయ్ కుమార్ గత 4 విడతల్లో చేపట్టిన పాదయాత్ర 13 ఎంపీ, 48 అసెంబ్లీ, 21 జిల్లాల మీదుగా సాగింది. మొత్తం 1178 కి.మీలు నడిచారు.
 
తాజాగా మైసా(బైంసా) నుండి ప్రారంభమైన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, కొండగట్టు, గంగాధర మీదుగా సాగి కరీంనగర్ ఎస్సారార్ కళాశాలవద్ద ముగిసింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 222 కి.మీలు నడిచారు. తద్వారా మొత్తం ఐదు విడతల్లో బండి సంజయ్ మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1400 కి.మీలు నడిచారు. 
 
మరోవైపు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభ వేదికపైనా 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ను ప్రకటించేందుకు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. 
 
భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి కరీంనగర్ లో నిర్వహించబోయే సభ వరకు మొత్తం 14 భారీ బహిరంగ సభలు జరిపారు. వందకుపైగా మినీ సభలతోపాటు పెద్ద ఎత్తున రచ్చబండలు, స్థానిక నేతలతో ఇంట్రాక్షన్ చర్చలు జరిగాయి. 
 
పాదయాత్రపై ప్రధాని ఆరా 
బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ను తన వద్దకు పిలిచి ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. 
 
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని, సంజయ్‌ పాదయాత్ర ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. దీంతో సంజయ్‌ యాత్రకు ప్రజల్లో మంచి ప్రతిస్పందన లభిస్తోందని లక్ష్మణ్‌ చెప్పగా, ‘మంచిది’ అంటూ మోదీ ప్రశంసించారు.  పాదయాత్రకు ప్రజల్లో లభించిన ప్రతిస్పందన గురించి తనకు నివేదిక కావాలని మోదీ కోరారు.ఈ నివేదిక ఆధారంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా రూపొందించాలని, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా దానిని ప్రదర్శించాలని సూచించారు.
తెలంగాణలో పార్టీకి లభిస్తున్న ప్రతిస్పందన ఇతర ప్రాంతాలకు కూడా తెలిస్తే ప్రేరణగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. కాగా, సంజయ్‌ పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతోందని కూడా లక్ష్మణ్‌ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.