బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి సుమారు 20 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారంనాడు విమర్శల దాడి చేయడంతో ముఖ్యమంత్రి ఓ దశలో సహనం కోల్పోయారు. ”తాగేసి వచ్చారా?” అంటూ విపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లో 2016 నుంచి మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కట్టుదిట్టంగా దానిని అమలు చేయడంలో సర్కార్ వైఫలమైందని, ఆ కారణంగానే తాజా మరణాలు సంభవించాయని విపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీలో నిలదీశారు. ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ పలువురు విపక్ష ఎమ్మెల్యేలు ప్లకార్లులు ప్రదర్శించారు.
దీంతో నితీష్ అగ్రహానికి గురయ్యారు. ”మద్యం తాగి సభకు వచ్చారా? మీరు చేస్తున్నది సరైన పని కాదు. దీన్ని సహించేది లేదు” అని తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
అయితే నినాదాలు చేస్తున్న వారిపై సీఎం నితీశ్ కుమార్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం జరిగింది? నిశ్శబ్దంగా ఉండండి. వారిని సభ నుంచి బయటకు పంపండి’ అని పేర్కొన్నారు. ‘మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది.. మీరే పెద్ద తాగుబోతులు’ అన్నట్లుగా ఉన్న ఆయన మాటలతో గల వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాల వెనుక నితీష్ కుమార్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వస్తున్నదో వివరించాలని బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. కాగా, మద్యం సాగి సభకు వచ్చారా అంటూ సీఎం అసెంబ్లీలో గద్దించడంపై బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గి వయసు పెరుగుతుండటంతో ఆయనకు కోపం పెరుగుతోందని ఆ పార్టీ నేత గిరిరాజ్ సింగ్ విమర్శించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో సహా బీహార్ బిజెపి నాయకులు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను రాష్ట్రంలో నిషేధ విధానాన్ని పునరాలోచించాలని కోరారు. ఇది తరచుగా మరణాలకు, దానితో సంబంధం ఉన్న నేరాల పెరుగుదలకు కారణమయ్యే నకిలీ మద్యం అక్రమ విక్రయాలతో విఫలమైందని విమర్శించారు.
బీహార్‌లో ప్రతిరోజూ నకిలీ మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమలులో నితీష్ ప్రభుత్వం విఫలమై మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
నితీష్ పని అయిపోయిందని, అందుకే కోపం ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఎద్దేవా చేశారు. నితీష్ వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎమ్మెల్యేలు సభ బయట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు