సరిహద్దుల్లో డ్రాగన్ దురాక్రమణలపై భారత్ కు బాసటగా అమెరికా 

ఓవైపు సరిహద్దు చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలతో అరుణాచల్‌లోని తవాంగ్ వద్ద భారత భూభాగంలోకి తెగబడిన చైనా తీరును అగ్రదేశమైన అమెరికా తప్పుపట్టింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. తమ భాగస్వాముల భద్రతకు సహకరించేందుకు తాము దృఢంగా కట్టుబడి ఉన్నమని తెలిపింది.
అమెరికాలోని రక్షణ శాఖ కేంద్ర పెంటగాన్, అమెరికా విదేశాంగ శాఖ సైతం యాంగ్జే వద్ద చైనా-భారత్ దళాల ఘర్షణపై ఘాటుగా స్పందించాయి. ”భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను జాగ్రత్తగా గమిస్తున్నాం. చైనా నిరంతరాయంగా సైనిక మౌలిక వసతుల నిర్మాణాలు, దళాలు మోహరిస్తోంది. ఇది ఇండో పసిఫిక్‌లోని మా మిత్రులు, భాగస్వాములను కవ్వించే వైఖరిగా కనిపిస్తోంది” అని స్పష్టం చేసింది.
“మేము మా భాగస్వాముల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఇదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నాం” అని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఎల్ఎసీ వెంబడి ఏకపక్షంగా యథాతథ పరిస్థితిని మార్చేందుకు యత్నించడాన్ని తాము వ్యతిరేకిస్తామని తేల్చి చెపింది.
విభేదాల పరిష్కారానికి ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించుకుని పరిష్కరించుకోవాలని, ఈ విషయమై ఉభయ దేశాలను (భారత్-చైనా) తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. భారత్ ద్వైపాక్షికంగానే కాకుండా, క్యాడ్ వంటి పలు వేదికలపై కూడా తమకు వ్యూహాత్మక భాగస్వామిని అని ఆయన చెప్పారు.
మరోవైపు, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఐరాస సెక్రటరీ జనర్ల ఆంటోనియా గుటెర్రస్ కూడా ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 2020లో గల్వాన్‌‌లో చైనా దురాక్రమణను భారత్‌ గట్టిగా తిప్పికొట్టినప్పటి నుంచి లోలోపల ఉడికిపోతున్న డ్రాగన్ దేశం ఇదే అదనుగా మరోసారి అరుణాచల్‌లో దురాక్రమణకు గత శుక్రవారం తెగబడింది.
గల్వాన్ ఘటనలో 20 మంది భారత సైనికులు, 40 మంది చైనా సైనికులు మరణించిన ఘటనను భారతదేశ ప్రజలు మరచిపోకముందే మరోసారి 400 మంది సైనికులతో మన దేశ చెక్‌పోస్టును ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలు, టీజర్ గన్‌లతో మన దేశ చెక్‌పోస్టును ఆక్రమించే ప్రయత్నానికి దిగింది. అక్కడి భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని హెచ్చరించింది.
ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్న భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. కొద్ది సమయంలోనే అదనపు బలగాలు రావడం, ఎదురు దాడికి దిగడంతో చైనా బలగాలు తోకముడిచాయి. అరగంటలోనే వాస్తవాధీన రేఖ ఆవలకు డ్రాగన్ సైన్యాన్ని తరిమికొట్టింది. భారత్ సైన్యంలో సుమారు 15 మంది, అంతకంటే ఎక్కువ మంది శత్రుదేశం సైనికులు గాయపడ్డారు.
కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ యాంగ్ట్సే ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) దాటడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పంస్తూ ప్రస్తుతం ఉన్నది 1962 నాటి భారత్‌ కాదని, దురాక్రమణకు పాల్పడేవారికి సైన్యం గట్టిగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ‘‘యాంగ్ట్సే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉంది. ఏటా నేను అక్కడికి వెళ్తుంటా. జవాన్లతో మాట్లాడుతూ ఉంటా’’ అని పెమా ఖండూ పేర్కొన్నారు.