బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి!

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫిర్యాదుదారుడైన అధికార పార్టీకీ చెందిన తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న కొందరు బెంగళూరు అధికారులు సీఎంవోకు లీక్ చేయడంతో  కేసీఆర్ హడావుడిగా రోహిత్ రెడ్డితో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్టేట్‌‌మెంట్ రికార్డ్ చేయించారని ఆయన విమర్శలు చేశారు. 
 
డ్రగ్స్ కేసులో కర్నాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి గతంలో నోటీస్ వచ్చిందని, డ్రగ్స్ కేసు బయటకు వస్తే ఎమ్మెల్యే మాట వినడని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాస్తవాలు బయట పెడతాడని సీఎం భయపడుతున్నాడని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మాట్లాడుతూ సంజయ్ తెలిపారు.  రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ డి.దేవేందర్‌ బాబు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వాంగ్మూలంను మంగళవారం  నమో­దు చేశారు. 
 
క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్‌ నమోదు చేయాల్సి ఉండగా సరూర్‌నగర్‌ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. డ్రగ్స్‌ కేసులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి పాత్రపై ఆరా తీసేందుకు తమ లీగల్‌ టీమ్‌ బెంగళూరు వెళ్లిందని పేర్కొంటూ బెంగళూరు డ్రగ్స్‌ కేసు రీఓపెన్‌ చేస్తే చాలా విషయాలు బయటపడతాయని సంజయ్ స్పష్టం చేశారు. 
 
డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై విచారణ చేయాలని తాము కోరనున్నట్లు చెబుతూ తమ లీగల్‌ టీమ్‌ బెంగళూరు వెళ్లిన విషయాన్ని అక్కడి అధికారులు.. హైదరాబాద్ అధికారులకు చేరవేశారని, దీంతో సీఎం కేసీఆర్ హడావుడిగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫైలట్ రోహిత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయించారని ఆరోపించారు. 
 
లీగల్‌ టీమ్‌ విచారణ చేస్తున్న విషయం రోహిత్‌రెడ్డికి తెలిస్తే  వాస్తవాలు బయటపెడతారని కేసీఆర్‌ బయపడ్డారని సంజయ్ ఆరోపించారు.   తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లపై సంజయ్​ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్.. ప్రశ్నించే వాళ్లను జైల్లో వేస్తున్నారని, ఇప్పుడు వాళ్లే హక్కుల గురించి మాట్లాడడం వింతగా ఉందని ధ్వజమెత్తారు. 
 
తన మాటలు కవితకు బాధనిపిస్తే తన తండ్రి వద్దకెళ్లి ఏడవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ మహిళల కండ్లలోంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్న కవిత కామెంట్లపై సంజయ్ స్పందించారు. ‘‘కొండగట్టు ప్రమాదంలో మహిళలు, గర్భిణులు చనిపోయినప్పుడు నీ కళ్లలో నిప్పులు ఎందుకు రాలేదు? రూ.లక్షల కోట్ల అవినీతి సొమ్ముతో లిక్కర్ దందా చేసి ఇరుక్కుంటే.. మహిళలంతా నిప్పులు కురిపించాలా?” అని ప్రశ్నించారు కేసీఆర్ అవినీతిని ఎండగడుతూ నిజాలు రాసే మీడియాను తొక్కేస్తున్నాడని, ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు.