చైనా సరిహద్దు ప్రాంతంలో వైమానిక దళం విన్యాసాలు

చైనాతో తాజా ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వాయు విన్యాసాలను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) నిర్వహిస్తున్నది. అయితే తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకే ఈ విన్యాసాలు చేపట్టినట్లు భారత వాయు సేన తెలిపింది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మేరకు గురువారం, శుక్రవారం తూర్పు ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో ఈశాన్య ప్రాంతంలో వాయు విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

భారత్‌, చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌లో ఈ నెల 9న ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు, ప్రస్తుత వాయు విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. కాగా, ఈశాన్య సరిహద్దులో చైనా కవ్వింపులను భారత వాయు సేన ధీటుగా తిప్పికొడుతున్నది. చైనా యుద్ధ విమానాలు ఇటీవల పలుమార్లు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) సమీపానికి వచ్చాయి. గమనించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దీంతో చైనా ఫైటర్‌ జెట్లు తోక ముడిచాయి.

ఈ నెల 9న తవాంగ్‌ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఈ సందర్భంగా చైనా ఫైటర్‌ జెట్లు ఎల్‌ఏసీ సమీపానికి వచ్చాయి. అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలు కూడా వెంటనే గాల్లోకి లేచి ఎదురుదాడికి సిద్ధమయ్యాయి.

కాగా, తవాంగ్‌ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని స్పష్టం అవుతున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు. చైనా మాత్రం ఇందుకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ వద్ద ఒక అబ్జర్వేషన్‌ పోస్ట్‌ ఏర్పాటుకు ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాన్ని భారత సైనికులు అడ్డుకున్నప్పుడే ఘర్షణ జరిగిందని ఓ సైనికాధికారి వెల్లడించారు.

శీతాకాలం సందర్భంగా భారత బలగాలు చేసుకుంటున్న ఏర్పాట్లు, కదలికలను తెలుసుకునేందుకు చైనా ఎల్‌ఏసీ వద్ద ఓపీ నిర్మించాలనుకుందని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని భారత సైనికులు చెప్పినా వినకపోవడంతో చైనా బలగాలను తరిమేశారని పేర్కొన్నారు.

భారత్కు చేరిన చివరి 36వ రఫేల్ యుద్ద విమానం

ఇలా ఉండగా, 36వ రఫేల్ యుద్ద విమానం భారత్కు చేరుకుంది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 36వ ఎయిర్ క్లాఫ్ట్ యూఏఈలో ఇంధనం నింపుకుని భారత్ లో దిగింది. సుధీర్ఘ ప్రయాణం తర్వాత 36వ రఫేల్ యుద్ద విమానం భారత్లో అడుగుపెట్టిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

కాగా, ఆత్యాధునిక 36 రఫేల్ యుద్ద విమానాలను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా దశల వారీగా రఫేల్ ఎయిర్ క్లాఫ్ట్స్ భారత్ చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు 35 రఫెల్స్ భారత్లో దిగాయి. తాజాగా చివరిదైన 36వ విమానం కూడా భారత్కు వచ్చేసింది.