సరిహద్దు వివాదంపై కర్ణాటక, మహారాష్ట్ర సంయమనం పాటించాలి

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం గురించి సుప్రీంకోర్టు సూచన మేరకు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే పాల్గొన్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ముగ్గురేసి మంత్రుల చొప్పున ఆరుగురు మంత్రులతో ఈ సమస్య పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పర్చుకోవాలని ఆయన సూచించారు. 
 
సరిహద్దు అంశంపై రాజకీయాలు చేయరాదని షా సూచించారు. సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై ఎటువంటి ప్రకటనలు చేయరాదని అమిత్ షా స్పష్టం చేశారు. 
 
ఈ మంత్రుల కమిటీ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇతర సమస్యలను కూడా పరిశీలిస్తోందని చెప్పారు. కాగా ఇద్దరు ముఖ్యమంత్రులు సరిహద్దు సమస్యను రోడ్లపై కాకుండా రాజ్యాంగపరంగానే పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చిన్నట్లు అమిత్ షా వెల్లడించారు. 
 
ప్రజలను రెచ్చగొట్టడం కోసం నకిలీ ట్విట్టర్ ఖాతాలను కొందరు సృష్టించినట్లు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుపుతూ, అటువంటి వారిపై ఎఫ్ఐఆర్ లను నమోదు చేయాలని కూడా నిర్ణయించామని తెలిపారు. 
 
మహారాష్ట్ర , కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇటీవల మరోసారి సరిహద్దు వివాదంపై హింస చెలరేగింది. బెళగావి, పుణెలలో ఇరు రాష్ట్రాలకు చెందిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇరు రాష్ట్రాల నేతల వ్యాఖ్యలు పరిస్థితిని మరించి ఉద్రిక్తంగా మార్చాయి.  దీంతో సరిహద్దు వివాదం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. 
 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కమిటీ ఏర్పాటుతో ఇరు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కొనసాగుతాయని అమిత్ షా ఆశాభావం వ్యక్త.  చేశారు  సుప్రీం కోర్టులో ఉన్న ఈ అంశంపై ఎటువంటి తీర్పు వెలువడినాఇరు రాష్ట్రాలు ఎటువంటి డిమాండ్లు తీసుకు రాకూడదని హితవు చెప్పారు.
ఇరు రాష్ట్రాల మంత్రులతో కమిటీ ఏర్పాటుపై చర్చించి ఒక నిర్ధారణకు రావాలని కోరారు. 1956లో ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర సరిహద్దులో కన్నడ మాట్లాడే గ్రామాలు తమవేనంటూ కర్ణాటక పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మహారాజన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.
వివాదంపై ఈ కమిషన్‌ 1960లో ఓ నివేదికను అందజేసింది. కానీ ఆ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ నివేదికలోని అంశాలు అమలు కాలేదు. చివరికి సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర ప్రభుత్వం 2004లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలోనే ఉంది.