పాక్‌ సరిహద్దులో భారీగా సాయుధులను మోహరించిన తాలిబన్లు

తాలిబాన్ ప్రభుత్వం దేశ సరిహద్దులో భారీగా సాయుధ బలగాలను మోహరించడంతో పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆదివారం నాటి కాల్పుల్లో ఆరుగురు పాకిస్థానీయులు చనిపోవడం ఈ ఉద్రిక్తతకు కారణంగా పేర్కొంటున్నారు.

ఎలాంటి రెచ్చగొట్టే పనులు చేయకున్నా తాలిబాన్లు కాల్పులు జరిపారని పాకిస్థాన్‌ సైన్యం, ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులతోపాటు ఒక సైనికుడు చనిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఒకరు మరణించారు. మరోవైపు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భద్రతా కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు.

చమన్ సరిహద్దులో ఏది జరిగినా తప్పుగా భావించాల్సి వస్తుందని షరీఫ్  స్పష్టం చేశారు. పాక్‌ సైన్యం, పౌరులపై తాలిబాన్లు అనవసరంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తాలిబాన్‌ ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునేది లేదని కాస్తా ఘాటుగానే హెచ్చరించారు.

మీడియా కథనాల ప్రకారం, ఆదివారం నాటి భారీ కాల్పుల నేపథ్యంలో చమన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సరిహద్దు ప్రాంతం చాలా కాలం పాటు మూసివేసి ఉంచారు. ఇప్పుడు ఆఫ్ఘన్ తాలిబన్లు ఈ ప్రాంతంలో ఎదురుదాడికి సన్నాహాలు ప్రారంభించారు. సరిహద్దులో సాయుధ వాహనాలు, ఫిరంగులు, ఇతర భారీ ఆయుధాలను తాలిబాన్‌ ప్రభుత్వం మోహరించింది.

ఎలాంటి ప్రతిచర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన చేష్టల ద్వారా తాలిబాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆదివారం నాటి కాల్పుల్లో ఆరుగురు చనిపోవడంపై తాలిబాన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, సరిహద్దులో కొత్త చెక్‌ పాయింట్ నిర్మాణాన్ని పాకిస్థాన్‌ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్‌ వైపు పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్లుగా తెలుస్తున్నది.

చైనా వ్యాపారవేత్తలున్న హోటల్‌లో పేలుళ్లు

ఇలా ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ లో చైనా వ్యాపారవేత్తలు బస చేసే ప్రముఖ హోటల్‌పై సోమవారం భయానక దాడి జరిగింది. ఈ దారుణ సంఘటనలో పెద్ద ఎత్తున పేలుళ్ళు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో ఒకటైన షహర్-ఈ-నా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పాకిస్థాన్‌లోని తాలిబన్ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం కొందరు వ్యక్తులు ఈ హోటల్‌లోకి ప్రవేశించి, దాడి చేశారు. వారిని మట్టుబెట్టేందుకు ప్రతిచర్యలు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.