భారత్‌కు భారీ ఓడల తయారీకి రష్యా సహాయం

భారత్‌కు భారీ సామర్థ్యమున్న ఓడల తయారీకి సహాయం అందించనున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జండర్‌ నోవాక్‌ తెలిపారు. ఇప్పటికే చౌకగా ముడి చమురు అందించడానికి అంగీకరించిన రష్యా  తాజా నిర్ణయం భారత్‌తో మరింత బంధం పెరగడానికి దోహదం చేయనుంది. 
 
డిసెంబర్‌ 9న మాస్కోలోని భారత రాయబారి పవన్‌ కపూర్‌తో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భారత్‌ భారీ సామర్థ్యంతో ఓడలు నిర్మించుకోవడంలో, అద్దెకు తీసుకోవడంతో రష్యా పూర్తి సహకారం అందిస్తుందని నోవాక్‌ హామీ ఇచ్చారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. 
 
రష్యా అమ్మే చమురు ధరలపై జి-7 దేశాలు విధించిన ఆంక్షలను భారత్‌ వ్యతిరేకించడాన్ని ఆ దేశ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేయడంతో పాటుగా భారీ ఓడల తయారీకి మద్దతును పలికింది. చమురు సంక్షోభం నెలకొన్నప్పటికీ ఇంధన వనరుల సరఫరాలో రష్యా తన ఒప్పంద బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తోందని నోవాక్‌ తెలిపారు. 
 
డిసెంబర్‌ తొలి వారంలో జరిగిన జి-7 దేశాల భేటీలో రష్యా చమురుకు గరిష్ఠంగా 60 డాలర్లు చెల్లించాలని నిర్ణయించాయి. ఈ పరిమితి కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుపై బీమా సేవలు, షిప్పింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి.  ఈ ఆంక్షలను వ్యతిరేకించిన భారత్‌కు రష్యా చౌకగా చమురు సరఫరాకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది.
ఐరాసలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు

కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై తన మద్దతు ప్రకటించింది. ప్రాపంచిక, ప్రాంతీయ అంశాలపట్ల అనుసరిస్తున్న తీరుతో ఐరాస భద్రతామండలికి భారత్‌ అదనపు వెలుగులు అద్దగలదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. 

ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్‌ ముందంజలో ఉన్నదని, త్వరలోనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించబోతున్నదని లావ్రోవ్‌ తెలిపారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించుకోవడంలో భారత్‌ అద్భుతమైన దౌత్యపర అనుభవం కలిగి ఉన్నదని ఆయన కొనియాడారు.

ఈ నెల 7న మాస్కోలో జరిగిన ప్రైమకోవ్‌ రీడింగ్స్‌ ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లావ్రోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో, షాంఘై సహకార సంఘంలో భారత్‌ క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. 

గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి 77వ సర్వప్రతినిధి సభలో కూడా సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు.  భారత్‌తోపాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. భద్రతామండలిలో తీసుకు రావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు.