డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టర్‌లోని యాంగ్జి ప్రాంతంలో చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని, అయితే, వారి ప్రయత్నాల్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి మంగళవారం లోక్‌సభలో ఓ ప్రకటన చేస్తూ ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతిచెందలేదని, ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేశారు.
ఎటువంటి అతిక్రమణలనైనా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. చైనా దళాల ప్రయత్నాన్ని మన దళాలు దృఢ సంకల్పంతో ఎదిరించాయని చెబుతూఈ ఘర్షణలో భౌతిక, శారీరక పోరాటం జరిగిందని చెప్పారు. పీఎల్ఏ దళాలు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా మన సైనికులు ధైర్యసాహసాలతో నిలువరించారని కొనియాడారు.
పీఎల్ఏ దళాలు తిరిగి తమ స్థావరాలకు వెళ్ళిపోయే విధంగా చేశారని పేర్కొంటూ ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారన్నారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడటం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరగలేదని సభకు స్పష్టం చేస్తున్నానని తెలిపారు. చైనా సైనికులను విజయవంతంగా తమ పోస్టు నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు.
మన దళాలు మన దేశ సరిహద్దులను కాపాడటానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లోని యథాతథ స్థితిని సవాల్ చేసి, మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొట్టడానికి మన దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు.
స్థానిక ఇండియన్ మిలిటరీ కమాండర్ డిసెంబరు 11న చైనీస్ మిలిటరీ కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపారని తెలిపారు. మన రక్షణ దళాల ధైర్య సాహసాలకు పార్లమెంటు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. భారత దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే సత్తా మన సైన్యానికి ఉందని తేల్చి చెప్పారు.
మన సైనికుల ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నామని పేర్కొన్నారు. గెలిచే అవకాశం చైనాకు ఇవ్వబోమని హామీ ఇస్తున్నానని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై డిసెంబరు 9న దాడి చేశారు. ఇరు దేశాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారని భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారని, వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది. చైనా సైనికులు ఎక్కువ మంది గాయపడినట్లు తెలుస్తోంది.
అరుణాచల్ వద్ద ఫైటర్ జెట్స్ పెట్రోలింగ్
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, ఈ ఘర్షణలో భారత సైనికుల కన్నా ఎక్కువ సంఖ్యలో చైనా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది చైనా సైనికులు సకల హంగులతో భారత సైనికులపై దాడికి తెగబడినప్పటికీ, భారత సైనికులు సర్వసన్నద్ధంగా ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారని సమాచారం. భారత సైనికుల ధాటికి తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. స్వల్పంగా గాయపడిన భారత సైనికులను అస్సాంలోని గువాహటి సైనిక ఆసుపత్రిలో చేర్పించారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!