అరుణాచల్ సరిహద్దులో హద్దు మీరిన చైనా… సైనికుల ఘర్షణ

మరోసారి చైనా దళాలు సరిహద్దులో దురాక్రమణకు పాల్పడి, ఘర్షణకు కాలుదువ్వాయి. ఈసారి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) దాటి భారత భూభాగంలోకి చొరబడ్డారు. వీరిని భారత సైనికులు అడ్డుకుని… నిలువరించారు. 

ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని, చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 9వ తేదీన జరిగిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.  అయితే, ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపాయి. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎల్‌ఏసీ వద్ద ఉన్న తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌, చైనా సైనికులు ఎవరి హద్దులను వారు పరిరక్షిస్తున్నారు. అయితే, ఈ నెల 9న చైనా సైనికులు ఎల్‌ఏసీని దాటి చొచ్చుకువచ్చారు. భారత సైనికులు వారిని గట్టిగా నిలువరించారు. ఆ సమయంలో సుమారు 600 మంది చైనా సైనికులు అక్కడ ఉన్నారు. వారు ముందుకు రావడానికి ప్రయత్నించడం, భారత సైనికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

 ‘‘2006 నుంచి తవాంగ్‌ సెక్టార్‌లో ఉన్న ఎల్‌ఏసీ వద్ద ఇరు దేశాల సైనికులు గస్తీగా ఉన్నారు. అయితే, ఈ నెల 9న భారత హద్దులోకి చైనా దళాలు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశాయి. భారత సైన్యం వారిని గట్టిగా నిలువరించింది. ఈ విషయం తెలిసిన వెంటనే భారత కమాండర్‌ రంగంలోకి దిగి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చైనా కమాండర్‌తో తక్షణ చర్చలు చేపట్టారు. ఆ తర్వాత ఇరు దేశాలు తమ తమ దళాలను తక్షణం వెనక్కి పిలిపించాయి’’ అని ఒక అధికారి తెలిపారు.

గతంలోనూ ఈ ప్రాంతంలో ఇరు బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ‘సరిహద్దు’పై భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే దీనికి కారణమని సైనికాధికారులు చెబుతున్నారు. 2006 నుంచి చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకొంటూనే ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపైకి వచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించగా, భారత సైనికులు వారిని అడ్డగించారు.

కాగా, 2021, అక్టోబరులో కొందరు చైనా సైనికులు ఎల్‌ఏసీని దాటి రావడంతో భారత సైనికులు వారిని కొన్ని గంటలపాటు నిర్బంధించారు. ఇక, గత కొన్నేళ్లుగా ఎల్‌ఏసీ వద్ద భారత సైన్యం మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతోపాటు, అరుణాచల్‌లోని ఇతర ప్రాంతాలపైనా పట్టుసాధిస్తోంది.

2020 గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌, చైనా సైనికుల మధ్య భౌతిక దాడులు జరగటం మాత్రం ఇదే తొలిసారి. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాదాపు 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడైంది.

ఈ ఘటనతో రెండు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.  ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య పాంగాంగ్‌ సరస్సు సహా ఇతర అంశాలపై వివాదాలు చోటు చేసుకున్నాయి.  ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక కమాండర్లు పలుమార్లు భేటీ అయి చర్చించుకుని, చివరకు కీలక ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించారు.