రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పన్నా జిల్లా పొవై తహసీల్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదేశంపై పన్నాలోని పావై పోలీస్ స్టేషన్‌లోపటేరియాపై కేసు నమోదైంది. పటేరియాను దామోహ్ జిల్లాలోని హటా పట్టణంలోని అతని నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేశారు.
‘ప్రధాని మోదీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ పిలుపిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్నాయి.
దీంతో పటేరియా పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో ఆయన పై ఎఫ్‌ఐఆర్ భారతీయ శిక్షా స్మృతిలోని 451, 504, 505,506 సెక్షన్ల మేరకు బుక్ అయింది. శాంతిభద్రతల విచ్ఛిన్నానికి, పరిధి దాటి మాట్లాడటం, దుష్ప్రవర్తనకు దిగడం వంటి అభియోగాలు ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావాడంతో రాజా పటేరియా దీనిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీని చంపడం అంటే ఎన్నికల్లో మోదీని ఓడించాలనే అర్థంలో తాను మాట్లాడానని చెప్పారు. తాను మహాత్మా గాంధీ అనుచరుడినని హింసను ప్రోత్సహించబోనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మనస్తత్వాన్ని ఈ వీడియో క్లిప్ ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన నిజమైన చిత్రం ఇది. కాంగ్రెస్ మోదీని ఓడించదు, అందుకే ఆయనను చంపాలనుకుంటోంది” అని ఆయన మండిపడ్డారు.
దేశ ప్రధానిపై ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలకు దిగిన వ్యక్తిపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. అంతకు ముందు కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు విడి శర్మ వెల్లడిస్తూ, ప్రధానిని అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మరో వైపు రాష్ట్ర బిజెపి ప్రతినిధి బృందం ఒకటి డిజిపిని కలిసింది. పటేరియాను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేసింది.
More Stories
కెనడాలో హిందూ ఆలయంపై దాడి పిరికిపంద చర్య
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు