పిటి ఉషా జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం  

ప్రముఖ క్రీడాకారిణి, రాజ్యసభ సభ్యురాలైన పిటి ఉషను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధంకర్‌ సోమవారం రాజ్యసభలో ప్రశంసించారు. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.  డిసెంబర్‌ 10న ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓసి) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళా ఛాంపియన్‌ పి.టి ఉషను ఆయన అభినందించారు.

`అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒలింపిక్‌ గేమ్స్‌ (1984లాస్‌ ఏంజెల్స్‌)లో ఆమె 20 ఏళ్ల వయసులోనే ప్రవేశించారు. ఒలింపిక్‌ గేమ్స్‌లో ఆమె తొలి భారతీయ మహిళ కావడం విశేషం. జకర్తాలో జరిగిన ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు సాధించారు. అందులో ఐదు బంగారు పతకాలు సాధించడం విశేషం’ అని గుర్తు చేశారు.

అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన పిటి ఉష… ప్రస్తుతం ఆటలను, స్పోర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడం వంటి బాధ్యతల్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఆమె ఛాంపియన్‌గా సాధించిన పతకాలు, రికార్డులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ధంకర్‌ కొనియాడారు.

కాగా, పిటి ఉష డిసెంబర్‌ 10వ తేదీన ఐఒఓ అధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పిటి ఉష అసలు పేరు పిలావుల్లకండి టెక్కెపరంబిల్‌ ఉష (58). కేరళకు చెందిన ఉష 1979 – 80లలో ఛాంపియన్‌గా పలు పతకాల్ని సాధించి రికార్డు సృష్టించారు. ఆమె 16 ఏళ్ల వయసులోనే 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్‌ గేమ్స్‌లో అథ్లెట్ల బృందానికి ప్రాతినిధ్యం వహించారు. 

1981లో 100, 200 మీటర్ల పరుగుల్లో రికార్డులను నెలకొల్పారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌లో 100 మీ, 200 మీటర్ల రేసులో రజత పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. 1983లో 200 మీటర్ల రేసులో తన రికార్డును తానే బద్దలు కొట్టి 400 మీటర్ల రేసులో నిలిచింది. 

ఇక 1984లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున ఒకేఒక్క పతకాని సాధించిన ఘనత ఈమెదే. 1985లో జకార్తాలో జరిగిన ఆసియన్‌ ఛాంపియన్స్‌షిప్‌లో ఆరు పతకాల్ని సాధించింది. అందులో ఐదు బంగారు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1986లో సియోల్‌ ఆసియా క్రీడల్లో ఆమె మరో నాలుగు పతకాల్ని సాధించింది. ఆమె ఇప్పటివరకు 23 పతకాలు సాధించగా, అందులో 14 స్వర్ణ పతకాలున్నాయి.