యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం

— ఎ.ఎస్. సంతోష్ 

యూనిఫామ్ సివిల్ కోడ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చిస్తున్న అంశం. దీన్నే ఉమ్మడి పౌర స్మృతి అని కూడా అంటున్నాం. ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వ్యతిరేకత, ఆందోళనల మధ్య ఈ బిల్లు ముసాయిదా డిసెంబర్ 9న రాజ్యసభలో చర్చకు ప్రవేశపెట్టబడింది. అసలు ఏంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్? దీన్ని కొన్ని వర్గాలు ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నాయి? దేశానికి దీనివల్ల ఏవిధంగా ఉపయోగం?

ఏదైనా రెండు పార్టీలు.. అంటే ఇద్దరు వ్యక్తులు కానీ, రెండు సంస్థల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే చట్టాలను సివిల్ చట్టాలు అంటాం. అంటే పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో తలెత్తే వివాదాలు. ఈ సివిల్ చట్టాలకు మూలాధారం మతపరమైన ఆచారాలు. ఈ మతాచారాలను అనుసరిస్తూనే చట్టాలు చేయబడ్డాయి. ఉదాహరణకు హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా, పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి. ఇకపోతే సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరాలను పరిష్కరించి నిందితులను శిక్షించే చట్టాలను క్రిమినల్ చట్టాలు అంటాం. ఈ క్రిమినల్ చట్టాలు మతాలకు అతీతంగా అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఉదాహరణకు హత్య, దోపిడీ, తీవ్రవాద చర్యలు మొదలైనవి.

ఇందాక చెప్పుకున్న పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి సివిల్ వివాదాల పరిష్కార సమయంలో మతపరమైన నిబంధనల కారణంగా బాధితులకు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటిని నివారించడంలో అన్ని మతాల వారికీ సమానంగా వర్తించేవిధంగా రూపిందించిన చట్టమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వివాదాలలో బాధితులకు చెల్లించే భృతి, భరణం, పరిహారం, ఆస్తి పంపకం వంటి అంశాలకు ఆయా మత నియమాలకు అతీతంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరిష్కారం చూపిస్తుంది.

ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. శాసనవ్యవస్థ దీనిపై ఇంతకాలం స్పందించలేదు. కనీసం ఆ దిశగా కూడా ఏ చర్యలూ తీసుకోలేదు. (వ్యక్తిగత) మత చట్టాలే ఇప్పటికీ అమలవుతున్నాయి. నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతిపాదన ఇప్పటిది కాదు. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణం కామన్ సివిల్ కోడ్ అమలు చేసే బాధ్యతను ప్రభుత్వాలకు గుర్తుచేస్తోంది. ఇంకా ముందుకు వెళ్తే 1840 నాటి బ్రిటిష్ ప్రభుత్వం యూనిఫామ్ క్రిమినల్ కోడ్ రూపొందించిన సమయంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రాముఖ్యాన్ని కూడా ప్రస్తావించినప్పటికీ నాటి కాలమాన పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు.

మతపరమైన చట్టాలు, నిబంధనల మాటున మహిళల ప్రాథమిక హక్కులకు తీవ్రమైన ఉల్లంఘనలు వాటిల్లిన అనేక కేసులు అనేకం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రతిపాదనకు పురిగొల్పాయి. అటువంటి వాటిలో ప్రముఖమైన కేసు మహ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా భానో బేగం కేసు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న న్యాయపోరాటంలో ఈ కేసును ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుతో యావత్ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చ మొదలైంది. 1978లో 62 ఏళ్ల ముస్లిం మహిళ షా బానో బేగంకు అతడి భర్త  మొహమ్మద్ అహ్మద్ ఖాన్ 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. వారిద్దరికీ 5గురు పిల్లలు. మొదట ఆమెకు మనోవర్తి కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అయితే స్థానిక కోర్టు రూలింగ్ వల్ల మొదట కొద్ది నెలలు ఆమెకు భరణం చెల్లించిన అహ్మద్ ఖాన్ చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. ముస్లిం పర్సనల్ లా అయిన షరియా ప్రకారం తాను ఇద్దత్ సమయం వరకే భరణం చెల్లిస్తానని, జీవితాంతం ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిన పనిలేదని వాదించాడు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అహ్మద్ ఖాన్ వాదనను సమర్ధించింది. కోర్టులు మతపరమైన నియమాల్లో తలదూర్చకూడదు అని వాదిస్తుంది. 1937 ముస్లిం పర్సనల్ లా ప్రకారం కోర్టులు కేవలం ఇస్లామిక్ నియమాలకు లోబడి మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుందని వాదించింది.

సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు, 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 క్రింద షాబానో, ఆమె ఇద్దరు పిల్లలకు మనోవర్తి చెల్లించాల్సిందే అని 1985లో కీలకమైన తీర్పును వెల్లడించింది. అదే సందర్భంలోనే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్.. ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని నొక్కిచెప్పారు. ‘కామన్ సివిల్ కోడ్ ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రతలను సాధించవచ్చు. పార్లమెంటు దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి” అన్నారు. ఈ తీర్పు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచించలేదు. వెంటనే, 1986లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ముస్లిం మహిళలకు వర్తించకుండా the Muslim Women (Protection on Divorce) Act 1986ను తీసుకొచ్చింది. ఈ చట్టం షా బానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయించిన మనోవర్తి చెల్లింపు సమయాన్ని తిరిగి ‘ఇద్దత్’ సమయానికి తగ్గించివేసింది. దీంతో షా బానో తరఫున న్యాయవాది Muslim Women (Protection on Divorce) Act 1986ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని అంగీకరిస్తూనే, మనోవర్తి చెల్లింపును ‘ఇద్దత్’ సమయానికే పరిమితం చేయడాన్ని మాత్రం ప్రశ్నించింది. అనంతరం కొన్ని కారణాలతో షా భానో తాను వేసిన మనోవర్తి పిటిషన్ను విరమించుకుంది.

యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని తెలియజేసే మరొక కీలకమైన కేసుగా 1995 నాటి సరళా ముద్గల్ కేసును పేర్కొంటారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మీనా మాథుర్ అనే మహిళను పెళ్లాడిన జితేందర్ మాథుర్, రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలో స్వీకరిస్తాడు. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అతడి రెండో పెళ్లి చట్టవిరుద్ధమని తేల్చింది. అదే సమయంలో సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.

అనంతరం అనేక ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని స్పష్టం చేస్తూ వచ్చిన ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ దేశంలో ఒక్క గోవా రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. దీన్ని పోర్చుగీసు వారి చట్టం నుండి స్వీకరించారు. ఉమ్మడి పౌర స్మృతి దిశగా 2014లో చేసిన బాల నేరస్తుల న్యాయ చట్టం ఓ ముందడుగని చెబుతారు. తమ మతపరమైన సంప్రదాయం ప్రకారం నిషేధమైనప్పటికీ ముస్లింలు ఏ మతం వారినైనా దత్తత తీసుకునేందుకు ఆ చట్టం వీలు కల్పిస్తుంది.

భిన్నమైన మతాలు కలిగిన దేశంలో ఉమ్మడి పౌర చట్టంపై ప్రతిఘటన రావొచ్చునన్న అనుమానాలూ లేకపోలేదు. ఇప్పటికే ఈ చట్టం తమ మతంపై దాడి అంటూ కొన్ని ముస్లింలు సంస్థలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇది వ్యక్తిగత అంశాల్లో జోక్యం అని, రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛకు అడ్డంకి అని ప్రకటనలు చేస్తున్నారు. 

అయితే ఎప్పటికప్పుడు సంస్కరించుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. మతం నియమాల పేరుతో మానవత్వాన్ని విస్మరిస్తే ప్రగతి సాధ్యం కాదు. సంస్కరణ అనేది అంతర్గతంగా మొదలుకావాలి.
(వ్యాసకర్త సామాజిక కార్యకర్త, ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ అధ్యక్షులు)