రూ.10.09 లక్షల కోట్ల మాఫీ చేసిన బ్యాంకులు

గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయ బ్యాంకులు మొత్తం రూ.10.09 లక్షల కోట్ల విలువైన మొండి పద్దులను  మాఫీ చేశాయని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  పార్లమెంటుకు   తెలిపారు. మాఫీ కారణంగా సంబంధిత బ్యాంకుల బ్యాలెన్స్ షీటు నుంచి నిరర్థక ఆస్తులను తొలగించినట్టు వెల్లడించారు. 
 
ఓ రాజ్యసభ ఎంపీ అడిగిన ప్రశ్నకు సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డుల నిర్ణయాలకు అనుగుణంగా బ్యాలెన్స్ షీటు క్లియరెన్స్, పన్ను ప్రయోజనాలు, మూలధనానికి వీలుగా రెగ్యులర్ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఎన్‌పీఏలను రద్దు చేశాయి” అని ఆమె చెప్పారు.
ఆర్బీఐ నుంచి అందిన సమాచారం ప్రకారం, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదేళ్లలో రూ.10,09,511 కోట్ల మొత్తాన్ని మాఫీ చేశాయని సీతారామన్ వెల్లడించారు. అయితే, బ్యాంకుల రుణమాఫీ కారణంగా రుణగ్రహీతలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆమె చెప్పారు.  రుణం తీసుకున్నవారు బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని, వారి ఖాతాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
రుణమాఫీ అకౌంట్లకు సంబంధించి బ్యాంకులు రికవరీ చర్యలు తీసుకుంటాయని, ఇందుకోసం అందుబాటులో ఉన్న పద్ధతులను అనుసరిస్తాయని ఆమె చెప్పారు.  సివిల్ కోర్టులు లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లో పిటిషన్లు, దివాళా, పరిష్కార కోడ్ 2016 ప్రకారం కేసులు, నిరర్థక ఆస్తుల విక్రయ రూపాల్లో రికవరీ చర్యలు ఉండనున్నాయని ఆమె వివరించారు.
కాగా గత ఏళ్లలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మొత్తం రూ.6,59,596 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయని ఆర్ధిక మంత్రి చెప్పారు.  మరోవైపు ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్ చెయిన్ టెక్నాలజీని కొద్ది పరిమాణంలో ఉపయోగిస్తున్నాయంటూ మరో ప్రశ్నకు సీతారామన్ సమాధానమిచ్చారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమాచారం ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ఇలా ఉండగా, పెద్ద పెద్ద కంపెనీల రుణాలు వీటిని ప్రభుత్వం రద్దు చేయలేదని లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.